జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద… 17గేట్లు ఎత్తి దిగువకు విడుదల

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద… 17గేట్లు ఎత్తి దిగువకు విడుదల

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద మళ్లీ పెరుగుతోంది. ఎగువన నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి.. నారాయణపూర్ ల మీదుగాజూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. నిన్న ఐదు గేట్లు ఎత్తిన అధికారులు తెల్లవారుజామున వరద భారీ గా పెరగడంతో మరో 12 గేట్లు ఎత్తేశారు.వరద ప్రవాహానికి అనుగుణంగా మొత్తం 17 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఉదయం 6గంటల సమయంలో  జూరాల ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో  1లక్ష 45 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1లక్స 42 వేల 69 క్యూసెక్కులు ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 8.010 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.690  మీటర్లు ఉంది. గేట్ల ఎత్తివేయాల్సిన పరిస్థితి రాడంతో ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో  5  యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లను రన్ చేస్తూ.. 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాలు కొనసాగుతుండడంతో మరికొన్ని గేట్లు ఎత్తి నీటి విడుదలను భారీగా పెంచే అవకాశం ఉంది.