కవ్వాల్ లో జంతువులకు ఆహార కొరత

కవ్వాల్ లో జంతువులకు ఆహార కొరత

నిర్మల్,వెలుగు: ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్​ అభయారణ్యంలో గడ్డి మైదానాల పెంపుపై అటవీశాఖ ఫోకస్​పెట్టింది. కొంత కాలం నుంచి కవ్వాల్ లో పులులు, క్రూరమృగాలు, శాఖహార జంతువులకు ఆహార కొరత ఏర్పడినట్లు గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. గ్రాస్ ల్యాండ్​పేరిట ప్రత్యేక స్కిమ్​ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 1177. 5266 హెక్టార్లలో 26 రకాల గడ్డిని పెంచుతున్నారు. దీంతో శాఖహారపు వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా పులులు, ఇతర క్రూరమృగాలకు ఆహార కొరత తీరనున్నట్లు భావిస్తున్నారు. గడ్డి మైదానాల పెంపుపై దృష్టి పెట్టిన అటవీ శాఖ గ్రాస్​ప్లాంట్ల గుర్తింపు, విత్తనాల సేకరణ, మైదానాలను అభివృద్ధి చేస్తుండడంతో ఇప్పుడు కవ్వాల్​ టైగర్​జోన్ గడ్డి మైదానాలతో కళకళలాడుతోంది. ఇటీవల ఎన్టీసీఏ సంస్థ గడ్డి మైదానాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ప్రయోజనాలపై దేశంలోని మరో 41 టైగర్ రిజర్వు ఫారెస్ట్​లకు కవ్వాల్​వివరాలు చేరవేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే కాంపా నిధులను గడ్డి మైదానాలకు వెచ్చిస్తున్నారు. 

విస్తరించిన టైగర్ జోన్​...

ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఖానాపూర్, నిర్మల్​డివిజన్​లలో కవ్వాల్​ అభయారణ్యం విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో గడ్డిమైదానాలు పెంచేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్  ప్రత్యేక దృష్టిసారించారు. ఫలితంగా శాఖాహార, మాంసహార జంతువులతో పాటు వివిధ రకాల పక్షుల సంఖ్య పెరగడం విశేషం.

టూరిజం స్పాట్​గా...

జంతువులు, పక్షులు, వివిధ రకాల భారీ వృక్ష సంపద ఉన్న కవ్వాల్ టైగర్​రిజర్వు ఫారెస్ట్​ను ప్రత్యేక టూరిజం స్పాట్​గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేక వెబ్​సైట్​ను కూడా రూపొందించారు. పర్యాటకులు కవ్వాల్​ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్​సైట్ ద్వారా చూసుకునే అవకాశం కల్పించారు. www.kawal.com ద్వారా పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడి సయ్యాద్రి పర్వతాలు, అందాలు కూడా కవ్వాల్ అభయారణ్యానికి అదనపు ఆకర్షణగా మారనున్నాయి. ఎకో టూరిజం పేరిట ఈ అభయారణ్యంలోని సహజ సిద్ధమైన ప్రదేశాలు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సఫారీ లాంటి ప్రత్యేకతలతో కూడిన అంశాలన్నీ పొందుపరుస్తున్నారు.

 

జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు...కవ్వాల్ టైగర్ జోన్​లో వృక్ష సంపద, జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. పక్షులు, వాహనాల ప్రవేశంపై నిషేధం కొనసాగుతోంది. అటవీ శాఖ చేపట్టిన చర్యల కారణంగా చెట్ల నరికివేత తగ్గిపోయింది. కలప స్మగ్లర్లు, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. గడ్డి మైదానాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. - కోటేశ్వర్​రావు, ఎఫ్డీవో, ఖానాపూర్​