నాల్గో టెస్టు డ్రా..వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లోకి భారత్

నాల్గో టెస్టు డ్రా..వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లోకి భారత్

అహ్మదాబాద్  టెస్టు డ్రా అయింది. భారీ స్కోర్లు నమోదైన టెస్టులో భారత్ ఆస్ట్రేలియా జట్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. డ్రా అయ్యే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో  2 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన మాథ్యూ కన్హేమన్ 6 పరుగులే చేసి ఔటవ్వగా..మరో ఓపెనర్ ట్రావీస్ హెడ్ 90 పరుగులు చేశాడు. లబుషేన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో నాల్గు మ్యాచుల టెస్టు సిరీస్ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. దీంతో పాటు...వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి భారత్ దూసుకెళ్లింది. 

హెడ్ సూపర్ ఇన్నింగ్స్..

చివరి రోజు ఓవర్ నైట్ స్కోరు 3/0 తో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆసీస్ ఆదిలోని వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ మాథ్యూ కన్హేమన్ 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లబుషేన్ హెడ్తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హెడ్ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన హెడ్..90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో వీలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్..లబుషేన్ కలిసి పరుగులు సాధించాడు. అటు లబుషేన్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 213 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. అయితే టెస్టులో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. భారత బౌలర్లలో అశ్విన్, అక్షర్ పటేల్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. 

టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 186 పరుగులు చేయగా...శుభ్ మన్ గిల్ 128 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎస్ భరత్ 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో  లియోన్, ముర్ఫీ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. మిచెల్ స్టార్క్, మాథ్యూ కన్హేమన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేయగా...కామెరూన్ గ్రీన్ 114 పరుగులు కొట్టాడు. ముర్ఫీ 41 పరుగులు, లియోన్ 34 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీయగా...షమీ 2 వికెట్లు పడగొట్టాడు. జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.