మగాడినైతే బాగుండేది.. ఈ నొప్పి ఉండేది కాదు..

మగాడినైతే బాగుండేది.. ఈ నొప్పి ఉండేది కాదు..
  • నెలసరి నొప్పితో ఫ్రెంచ్ ఓపెన్ లో ఓడిన చైనా క్రీడాకారిణి
  • వరల్డ్‌ నంబర్‌ 1, పోలెండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తో సాగిన పోరులో ఓటమి

మహిళా క్రీడాకారులు రుతుక్రమ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వారి బాధలు వర్ణానాతీతం. చైనాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ ఫ్రెంచ్ ఓపెన్ ఆశలు ఆవిరయ్యాయి. సాధించాలనుకున్న గోల్ రిచ్ కాకపోవడంతో తీవ్ర ఆవేదనతో తన మనసులోని బాధను పంచుకుంది. 

టెన్నిస్ క్రీడాకారులకు ఫ్రెంచ్ ఓపెన్ కలల టోర్నీ. ఎర్రమట్టి కోర్టులో సత్తా చాటి గ్రాండ్ స్లామ్ సాధించాలని అందరూ ఆశపడుతుంటారు. సరిగ్గా ఈ ఆశతోనే 19 ఏళ్ల చైనా క్రీడాకారిణి జెంగ్ క్విన్వెన్ కూడా టోర్నీలోకి అడుగుపెట్టింది. క్వాలిఫయర్ తో పాటు తొలి మూడు రౌండ్లు గెలిచి ప్రీ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. ఇక్కడ ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్, పోలెండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తో తలపడింది. తొలి సెట్ లోనే స్వియాటెక్ కు గట్టి షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్ లో 7(5/7)-6తో టాప్ సీడ్ స్వియాటెక్ ను ఓడించింది. సరిగ్గా ఇదే సమయంలో క్విన్వెన్ కు నెలసరి నొప్పి మొదలైంది. అయినా ఆ బాధను భరిస్తూ రెండో సెట్ కు సిద్ధమైంది. కానీ, విపరీతంగా కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడుతూ మ్యాచ్ లో నిలవలేక తర్వాత రెండు సెట్లు ఓడిపోయింది. దీంతో క్విన్వెన్  ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.  6-7 (5/7), 6-0, 6-2 తేడాతో స్వియాటెక్ చేతిలో  ఓటమిపాలైంది. 

మ్యాచ్ తర్వాత జెంగ్ ఉద్వేగానికి లోనైంది. రుతుక్రమ సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎవరికీ అర్థం కావంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇది అమ్మాయిల సమస్య. తొలి సెట్ లో బాగానే ఆడినా రెండో సెట్ సమయానికి కడుపునొప్పి వచ్చింది. అయినా ప్రత్యర్థితో పోరాడుతూనే ఉన్నా ఆ శక్తి సరిపోలేదు. మ్యాచ్ సరిగా ఆడలేకపోయా. నా ఆట తీరుతో సంతోషంగా లేను. కానీ, ప్రకృతికి విరుద్ధంగా మనమేం చేయలేం కదా. నిజంగా నేను అబ్బాయినైతే బాగుండేది. అప్పుడు ఈ నొప్పి ఉండేది కాదు కదా’ అని జెంగ్ భావోద్వేగానికి గురైంది. వరల్డ్ నెంబర్ 1తో పోటీపడిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించానని జెంగ్ చెప్పింది. తనతో మరో మ్యాచ్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి (రుతుస్రావం) ఎదురుకాకూడదని ఉద్వేగంగా మాట్లాడింది.

మరిన్ని వార్తల కోసం..

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

కృష్ణా నీళ్లు ఆంధ్రకు.. గోదావరి జలాలు కాంట్రాక్టర్లకు