మస్తు వానలు ఫుల్లు నీళ్లు..చిన్నా పెద్దా ప్రాజెక్టుల గేట్లన్నీ ఖుల్లా

మస్తు వానలు ఫుల్లు నీళ్లు..చిన్నా పెద్దా ప్రాజెక్టుల గేట్లన్నీ ఖుల్లా
  • రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • గోదావరి, కృష్ణా బేసిన్లలో నీటి సిరులు
  • ‘కాళేశ్వరం’లో ఎల్లం పల్లి నుంచి మేడిగడ్డ వరకు ఓపెన్
  • శ్రీరాంసాగర్ గేట్లెత్తి 50 వేల క్యూసెక్కులు రిలీజ్
  • కృష్ణాపై జూరాల, శ్రీశైలం, సాగర్ గేట్లు కూడా ఓపెన్
  • వర్షాలు, వరదలకు పలు చోట్ల పంట నష్టం
  • యాదాద్రి జిల్లా వలిగొండలో 19.36 సెం.మీ. వర్షం
  • మంజీరా నదికి మాత్రం ఈసారీ వరద కరువే
  • నిజాంసాగర్ , సింగూరు ప్రాజెక్టులు వెలవెల

వెలుగు, నెట్​వర్క్​: జోరు వానలతో గోదావరి, కృష్ణా బేసిన్లలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని చిన్నా పెద్ద ప్రాజెక్టులన్నీ ఫుల్​ అయ్యాయి. దీంతో వాటి గేట్లన్నింటినీ ఖుల్లా పెట్టి వరదను కిందికి వదులుతున్నారు అధికారులు. గోదావరి బేసిన్​లో ఉమ్మడి ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఎస్సారెస్పీలోకి మంగళవారం సాయంత్రానికి 74 వేల క్యూసెక్కుల వరద వస్తే.. 16 గేట్లు తెరిచి 50 వేల క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు. ఎల్లంపల్లి 6 గేట్లు,  సుందిళ్ల 56, అన్నారం 45, మేడిగడ్డ 46 గేట్ల నుంచి వరద సముద్రం బాట పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి లక్షా 13 వేల క్యూసెక్కుల వరద కిందకు ఉరకలెత్తుతోంది. ఖమ్మంలోని గోదావరి ఉపనదులపై నిర్మించిన రిజర్వాయర్లు నిండడంతో వాటి గేట్లనూ తెరిచారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులను ఆగస్టులోనే ఓపెన్​ చేశారు. ఇప్పుడు వరద పెరగడంతో మళ్లీ తెరిచారు.

ఎస్సారెస్పీ నుంచి మానేరుకు భారీ వరద రావడంతో మిడ్​​మానేరు6 గేట్లు, ఎల్​ఎండీ 20 గేట్లు ఓపెన్​​ చేశారు. ఇటు కృష్ణా నదికీ అదే జోరులో వరద వస్తోంది. ఇదివరకే ఆగస్టులో ఓ రౌండ్​ వరద రాగా.. మళ్లీ ఇప్పుడు రెండో రౌండ్​ వరద వస్తోంది. జూరాలకు 84 వేల క్యూసెక్కుల ఇన్​​ఫ్లో ఉండగా, 7 గేట్ల నుంచి అంతే మొత్తంలో కిందకు వదులుతున్నారు. శ్రీశైలం 5 గేట్లు, నాగార్జున సాగర్​​6 గేట్లను కుల్లా పెట్టి వరద నీటిని ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు. ఎగువన కర్నాటకలోని తుంగభద్ర, మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టుల గేట్లనూ ఎత్తారు.

ఎస్సారెస్పీ ఇంకో 8 గేట్లు కుల్లా

నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద పెరగడంతో మంగళవారం ఇంకో 8 గేట్లను ఓపెన్​ చేశారు. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్​​నాలా ప్రాజెక్టునిండడడంతో ఆరు గేట్లు ఎత్తారు. నాగారెడ్డి మండలం పోచారం ప్రాజెక్టు నిండడంతో వరద నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి 6.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జుక్కల్​ నియోజకవర్గంలో వాగులు ఉప్పొంగి ప్రవహించగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి. పిట్లం, పెద్దకొడప్​గల్​, మద్నూర్, బిచ్కుంద మండల్లాలోని పలు గ్రామాల్లో 2వేల ఎకరాల వరకు పంటలు నీట మునిగినట్లు అంచనా. కొన్ని చోట్ల రోడ్లు
కొట్టుకుపోయాయి.

ఎల్ఎండీ నాలుగేళ్ల తర్వాత..

కరీంనగర్​, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానేరు నది పొంగుతోంది. జగిత్యాల జిల్లాలో 13 సెంటీమీటర్లు, సిరిసిల్లలో 9 సెంటీమీటర్ల వర్షం కురవడంతో రెండు పట్టణాల్లోని కాలనీలు మునిగిపోయినయ్​. జగిత్యాల నుంచి మంచిర్యాల, సారంగాపూర్​‌, గొల్లపెల్లి పోయే రూట్లలో రాకపోకలు బందైనయ్​. సిరిసిల్లలో కొత్తచెరువు మత్తడి దుంకడంతో సిరిసిల్ల, కరీంనగర్​ మెయిన్​రోడ్​ మొత్తం మునిగిపోయింది. కరీంనగర్​‌ సమీపంలోని ఎల్​ఎండీ 20 గేట్లను నాలుగేండ్ల తర్వాత ఎత్తారు. కరీంనగర్​‌ జిల్లాలోని చాలా ఊర్లలో చెరువులు అలుగు పోసినయ్​. ఉమ్మడి జిల్లాల్లో వేలఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది.

సిరిసిల్లలో మునిగిన సాంచాలు

వర్షాలతో సిరిసిల్ల పట్టణం జలమయమైంది. కొత్త చెరువు నిండి శాంతినగర్​, అంబేడ్కర్​ నగర్, సిద్ధార్థనగర్​ తదితర లోతట్టు కాలనీల్లోకి వరదనీరు ముంచెత్తింది. శాంతినగర్​లో పవర్​ లూమ్స్​ నీట మునిగాయి. జోడీలు, వార్పిన్లు, కండెల మిషన్స్​​దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నేతన్నలు కోరుతున్నారు.
వరంగల్​ లాగానే సిరిసిల్లలోనూ కొందరు నాలాలు ఆక్రమించడం వల్లే చెరువు నీళ్లు కాలనీలు, ఇళ్లలోకి చేరినట్టు అధికారులు గుర్తించారు.

చెరువులు అలుగు పోస్తున్నయ్

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. మెదక్​ జిల్లా మిన్​పూర్​లో ఎక్కువగా 11 సెంటీమీటర్ల వాన పడింది. సిద్దిపేట, మెదక్​, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. ఆది, సోమవారాల్లో పడిన వానలకు యాదాద్రి జిల్లా వలిగొండ, రామన్నపేట మండలాల్లో రెండు కుంటలు తెగిపోయాయి. దీంతో వందల ఎకరాల్లో పంట దెబ్బతింది.  పోచంపల్లి, ఆత్మకూరు(ఎం), మోత్కూరు మండలాల్లో 13 గ్రామాల్లోని 911 ఎకరాల్లో వరి, 1‌‌‌‌‌‌‌‌9 ఎకరాల్లో పత్తి, 8 ఎకరాల్లో పెసర పంటకు నష్టం వాటిల్లినట్టు ఆఫీసర్లు చెప్పారు. వలిగొండలో 19.36 సెంటీమీటర్ల వర్షం కురవడంతో 67‌‌‌‌‌‌‌‌ ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు చెప్పారు.

పాలమూరు కరువుదీరా..

పాలమూరులో రెండురోజులుగా కరువుదీరా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వనపర్తి జిల్లాలోని సరళ సాగర్​ ప్రాజెక్టు, భీమా ఫేజ్​2తో పాటు అన్ని రిజర్వాయర్లూ నిండాయి. నారాయణపేట జిల్లా సంగంబండ రిజర్వాయర్​ మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్​ చేస్తున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వర ఆలయం కొండలపై నుంచి వాననీరు కిందికి దూకుతూ జలపాతాన్ని తలపిస్తోంది. ఇంకో రెండ్రోజులు వానలు పడతాయని, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్​గా ఉండాలని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ వెంకట్రావ్​ సూచించారు.

నిజాం సాగర్​, సింగూరు వెలవెల

అన్ని నదుల్లోనూ వరద కళ కనిపిస్తుంటే.. గోదావరికి ఉపనది అయిన మంజీరా బేసిన్​లో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. నదికి వరదలు లేకపోవడంతో దానిపై నిర్మించిన సింగూరు, నిజాంసాగర్​ ప్రాజెక్టులు నీళ్లు లేక వట్టిపోయి కనిపిస్తున్నాయి. నిజాంసాగర్​ పూర్తి నిల్వ 17.80 టీఎంసీలు కాగా మంగళవారం నాటికి కేవలం 2.56 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ ఫ్లడ్​ సీజన్​లో ప్రాజెక్టులోకి కొత్తగా 1.88 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయి. సింగూరు కెపాసిటీ 29.91 టీఎంసీలు కాగా 3.33 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ వానాకాలంలో కొత్తగా 3.50 టీఎంసీల నీళ్లు సింగూరులోకి వచ్చాయి. పోయినేడాదితో పోల్చితే రెండు రిజర్వాయర్లలో కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి.