
జవహర్ నగర్, వెలుగు : ప్రేమ పేరుతో ఓ యువకుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం కుషాయిగూడ ఏసీపీ మహేశ్, స్థానికులు తెలిపిన ప్రకారం.. జవహర్ నగర్ పరిధి శ్రీరామనగర్ కాలనీలో ఉండే శారద కంటోన్మెంట్ లో శానిటేషన్ కార్మికురాలు. ఆమె భర్త కుమార్ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. వీరి పెద్ద కూతురు శాలిని(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. నెల రోజుల కిందట శాలిని ఇంటికి వచ్చింది. అదే కాలనీలో ఉండే బోడ శివ(20) కూల్ డ్రింక్స్ షాపులో పనిచేస్తుంటాడు. బాలికతో చనువు పెంచుకుని ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తుండగా ఆమె తీవ్ర మనస్తాపం చెందింది.
గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బాలిక తల్లి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్లింది. ఇంట్లో బాలిక ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుంది. తల్లి వచ్చి తలుపులు తీయమని బాలికకు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి స్థానికులతో కలిసి తలుపులు పగలగొట్టారు. బాలిక ఫ్యానుకు వేలాడుతూ చనిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ప్రేమపేరుతో బోడ శివ వేధించడంతోనే తమ కూతురు చనిపోయిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 305, 78, ఏఎన్ఎస్ సెక్షన్, పోక్సో11, 12 వంటి పలు సెక్షన్లతో పాటు అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు కుషాయిగూడ ఏసీపీ మహేశ్ తెలిపారు.
తండ్రి తెచ్చిన డ్రెస్ బాగోలేదని...ఉరేసుకుని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్
దుండిగల్, వెలుగు: కొత్త బట్టలు బాగోలేవని మనస్తాపంతో ఇంటర్ స్టూడెంట్ హాస్టల్ లో సూసైడ్ చేసుకున్నాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటుకపల్లికి చెందిన పుట్టి వెంకటేశ్, వినోద దంపతుల కొడుకు నిఖిల్(16) దుండిగల్ లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఉండగా.. తండ్రి కొత్త డ్రెస్ తెచ్చి ఇచ్చి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం డ్రెస్ బాగోలేదని నిఖిల్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. వేరే డ్రెస్ వేసుకోమని కోపంతో చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన నిఖిల్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హాస్టల్ లోని తర రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దుండిగల్ పోలీసులు తెలిపారు .