ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఇంకెప్పుడు?

ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఇంకెప్పుడు?

 

  •     ఈ నెల 15 లోగా వర్సిటీలు గుర్తింపు ఇవ్వాలన్న ఏఐసీటీఈ
  •     2 నెలల కిందే ప్రభుత్వానికి జేఎన్టీయూ లెటర్
  •      ప్రైవేట్ వర్సిటీలకు లబ్ధి చేకూర్చేందుకే ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: అన్ని యూనివర్సిటీలు ఈ నెల 15 లోగా కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలని, అక్టోబర్ 20లోగా ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లు పూర్తి చేయాలని ఏఐసీటీఈ ఆదేశించింది. ఈ గడువు ఇప్పటికే పూర్తయింది. అయినా మన రాష్ట్రంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీకీ అఫిలియేషన్ రాలేదు. అసలు ఆ ప్రాసెస్ కూడా ప్రారంభం కాలేదు. రాష్ట్ర సర్కార్ నుంచి గైడ్ లైన్స్ రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈసారి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ యూనివర్సిటీలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అకడమిక్ ఇయర్ లో మన రాష్ట్రంలో 186 ఇంజనీరింగ్ కాలేజీలు, వాటిలో 1,05,873 సీట్లకు ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఆయా కాలేజీలకు సర్కారు నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉంది. ప్రభుత్వమిచ్చే గైడ్ లైన్స్ కు అనుగుణంగా కాలేజీలు, కోర్సులు, సీట్లకు వర్సిటీలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. గైడ్ లైన్స్ ఇవ్వాలని రెండు నెలల క్రితమే జేఎన్టీయూ ప్రభుత్వానికి లెటర్ రాసింది. కానీ ఇంతవరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వర్సిటీ అధికారులు, కాలేజీల వాళ్లు అయోమయంలో పడ్డారు.

ప్రాసెస్‌‌కు 10 రోజులు

ప్రతిఏటా మేలోనే అఫిలియేషన్ ప్రాసెస్ పూర్తయ్యేది. కరోనా ఎఫెక్ట్​తో ఈసారి ఇంకా కొనసాగుతోంది. గైడ్ లైన్స్ పై క్లారిటీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు సర్కార్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏఐసీటీఈ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 20 వరకు ఫస్ట్ ఫేజ్, నవంబర్ 1 వరకు సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తి చేయాలి. కానీ మన దగ్గర ఇంకా కాలేజీల అఫిలియేషన్లే పూర్తి కాలేదు. సర్కార్ గైడ్ లైన్స్ ఇస్తే.. ఆయా కాలేజీల్లో వర్సిటీ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో తనిఖీలకు అవకాశం లేకున్నా, కనీసం స్టాఫ్ వరకైనా వెరిఫై చేసే చాన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు సర్కార్ గైడ్ లైన్స్​ఇచ్చినా, ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు కనీసం 10 రోజుల టైమ్ అయినా పడుతుంది. దీంతో అఫిలియేషన్ ప్రాసెస్​ కోసం మరో 10 రోజులు టైమ్ ఇవ్వాలని జేఎన్టీయూ అధికారులు ఏఐసీటీఈని కోరారు.

అందుకే ఆలస్యం చేస్తున్న సర్కార్..

సర్కార్ ఈ ఏడాది రాష్ర్టంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చింది. వాటిలో ఇప్పటికే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ టైమ్ లో ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు వచ్చాయనే ప్రచారం జరిగితే.. ప్రైవేటు వర్సిటీల వైపు స్టూడెంట్స్ వెళ్లే అవకాశం ఉండదు. దీంతోనే కొత్త కోర్సులు, సీట్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు వర్సిటీలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం అఫిలియేషన్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తోందని స్టూడెంట్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి.

 గైడ్ లైన్స్ కోసం చూస్తున్నం

కాలేజీల అఫిలియేషన్, కోర్సులు, సీట్లపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. ఏఐసీటీఈ ఇచ్చిన గడువు ముగియడంతో మరో 10 రోజుల టైమ్ కావాలని కోరాం. సర్కారు నుంచి గైడ్ లైన్స్ రాగానే అఫిలియేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తాం. వెబ్ సైట్లను అప్ డేట్ చేయాలని, వాటిలో స్టాఫ్ వివరాలను పెట్టాలని ఇప్పటికే కాలేజీల మేనేజ్మెంట్లకు సూచించాం.

– మంజూర్ హుస్సేన్, జేఎన్టీయూ రిజిస్ట్రార్