మహిళా వర్సిటీకి పేరుపెట్టి వదిలేశారు

మహిళా వర్సిటీకి పేరుపెట్టి వదిలేశారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా యూనివర్సిటీని సర్కారు పట్టించుకోవడం లేదు. నెలన్నర కింద కోఠి విమెన్స్ కాలేజీని మహిళా వర్సిటీగా అప్​గ్రేడ్​ చేసింది. ఆ తర్వాత దాని గురించి మరిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయినా ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పర్యవేక్షణకు వైస్​చాన్స్​లర్​ను గానీ, స్పెషల్ ఆఫీసర్​ను గానీ ప్రభుత్వం నియమించలేదు.

హడావుడి చేసి మర్చిపోయారు

మహిళా యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలని సర్కార్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అప్​గ్రేడ్ జీవోతో పాటు గెజిట్ కూడా సర్కారు రిలీజ్ చేసింది. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ లోనే పూర్తయింది. ఈ సారి బడ్జెట్​లో ప్రభుత్వం రూ.వంద కోట్లు పెట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత నుంచి వర్సిటీ గురించి ఊసెత్తడమేలేదు. కానీ ఈ 2022–23 విద్యాసంవత్సరం మాత్రం పాత కోర్సులతోనే ప్రారంభమవుతోంది. రెండ్రోజుల కింద విడుదలైన సీపీగెట్ నోటిఫికేషన్​లో కోఠి ఉమెన్స్ కాలేజీలోని పాత కోర్సులనే కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

వీసీ, ఇతర సిబ్బంది నియామకాల్లేవ్

వర్సిటీకి వీసీ, రిజిస్ట్రార్ కీలకమైన పోస్టులు. మహిళా యూనివర్సిటీగా ప్రకటించినా ఇప్పటికీ ఆ రెండు పోస్టుల్లో ఎవ్వరినీ నియమించలేదు. కనీసం ఎవరికైనా వీసీగా ఇన్​చార్జీ బాధ్యతలూ అప్పగించలేదు. దీంతో వర్సిటీకి సంబంధించిన కీలకమైన పనులు పెండింగ్​లో పడ్డాయి. అయితే అప్పట్లో ఓయూ వీసీ రవీందర్​కు ఇన్​చార్జీ బాధ్యతలు ఇచ్చి, ఓ ఐఏఎస్ ఆఫీసర్​ను ప్రత్యేక అధికారిగా నియమిస్తారనే ప్రచా రం జరిగింది. కానీ ఇప్పటికీ నెలన్నర అవుతున్నా, ఆ ఊసే లేదు. ప్రస్తుతం వర్సిటీకి అవసరమైన సిబ్బందిని కూడా తీసుకోవలేదు. మరోపక్క ప్రస్తుతం విమెన్స్ కాలేజీలో పనిచేస్తున్న స్టాఫ్​కూ అక్కడే కొనసాగే ఆప్షన్​కూడా ఇవ్వాలని గతంలో నిర్ణయించినా, ఇప్పటికీ అది అమలు కాలేదు. అయితే వర్సిటీకి ప్రత్యేకంగా వీసీ ఉంటే పాలన, పనులు సరిగా జరుగుతాయని ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు.