హరితహారం నర్సరీ భూములకు కిరాయి పైసలిస్తలేరు

హరితహారం నర్సరీ భూములకు కిరాయి పైసలిస్తలేరు
  • 8 నెలలుగా పెండింగ్​​
  • ఒక్కో రైతుకు రూ.20 వేలపైనే
  • మొత్తం రూ.100 కోట్ల బకాయి
  • చాలా చోట్ల మొక్కల పంపిణీ అడ్డుకుంటున్న రైతులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హరితహారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. ప్రతి ఊరూ పచ్చగా కళకళలాడాలనే ఉద్దేశంతో మొక్కలు పంపిణీ చేయడం, నాటడం జోరుగా సాగుతోంది. హరితహారం నర్సరీల ఏర్పాటుకు భూములిచ్చి సహకరించిన రైతులు మాత్రం అద్దె బకాయిల కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూడాల్సి వస్తోంది. ఒక్కో రైతుకు రూ.20 వేలకుపైగానే పెండింగ్​ పెట్టినట్టు సమాచారం. దీంతో కొన్ని చోట్ల మొక్కల పంపిణీని రైతులు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.

నెలకు రూ. 3 వేల కిరాయి

రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు కలసి ఉపాధిహామీ పథకంలో భాగంగా నర్సరీలు ఏర్పాటు చేశాయి. ఇందుకోసం రైతుల దగ్గర కొంత భూమిని అద్దెకు తీసుకున్నాయి. ప్రతి రైతుకు నెలకు సుమారు రూ.3 వేల వరకూ అద్దెగా చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల రైతు ఖాతాలోకి అద్దె జమ చేస్తామని అధికారులు చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రైతులకు రెండు నెలలు పైసలు ఖాతాలో పడినా.. మరి కొన్ని జిల్లాల్లో కొంత మంది 8 నెలలుగా నయా పైసా అందలేదు. మరోవైపు నర్సరీలు ఏర్పాటు చేసిన చోట్ల రైతులు నీటి సరఫరా కూడా చేశారు. దీంతోపాటు గద్దె నిర్మాణం, ఇతర మెటిరియల్ బిల్లులు రావల్సి ఉంది. మొత్తంగా రైతులకు ప్రభుత్వం రూ.100 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. అద్దె డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు మొక్కల పంపిణీ అడ్డుకుంటున్నట్లు నర్సరీలను పర్యవేక్షిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు.

పంట వేసుకునే అవకాశం లేదు

కొద్ది రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. తమ భూముల్లో కొంత భూమి నర్సరీలకు ఇవ్వటంతో పంట సాగు చేసుకునే అవకాశం కూడా లేదని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో శాశ్వత నర్సరీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినా.. స్థలం కొరత, నిధులు ఇంత వరకు మంజూరు చేయలేదు. ప్రతి బుధవారం జరిగే సమావేశాల్లో నర్సరీల నిర్వాహకులు బిల్లుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి బిల్లులు పంపించామని వారు చెబుతున్నా ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు.

ఆరు నెలలుగా పైసలు పడలె

నాకున్న రెండెకరాల భూమిలో కొంత భాగం నర్సరీకి అద్దెకిచ్చాను. నర్సరీ నిర్వహణలో భాగంగా 20 వేల మొక్కలు పెంచాను. మొదటి రెండు నెలలు ఖాతాలో పైసలు పడ్డాయి. ఆరు నెలలుగా డబ్బులు పడలేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన లేదు. హరితహారం మొక్కల పంపిణీ పూర్తయి వారం గడుస్తున్నా.. పైసల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

– రాచకొండ రవి, నర్సరీకి భూమి ఇచ్చిన రైతు, యాదాద్రి భువనగిరి జిల్లా

మొక్కల పంపిణీని అడ్డుకుంటున్నారు

నర్సరీ మొదలుపెట్టి 8 నెలలు అవుతోంది. ఇంత వరకు రైతులకు అద్దె చెల్లించలేదు. రైతులు మమ్మల్ని తిడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళితే.. ప్రభుత్వానికి బిల్లులు పంపామని చెబుతున్నారు. డబ్బులు ఇచ్చే వరకు నర్సరీల నుంచి మొక్కలు తీసుకెళ్లనీయమని రైతులు చాలా సార్లు అడ్డుకున్నారు. వెంటనే పైసలు విడుదల చేయాలని కోరుతున్నాం.

– నర్సరీ నిర్వాహకుడు,
ఖమ్మం జిల్లా