జింఖానా గ్రౌండ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్

జింఖానా గ్రౌండ్  ఘటనపై ప్రభుత్వం సీరియస్

జింఖానా గ్రౌండ్స్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్రికెట్ టికెట్ల గందరగోళంపై మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన కార్యాలయానికి రావాలని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయి..ఎన్ని ఆన్లైన్లో పెట్టారు.. ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారు అనే సమాచారంతో రావాలని మంత్రి ఆదేశించారు.

హెచ్సీఏ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అడీషనల్ కమిషనర్ చౌహాన్ అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం టికెట్స్ కౌంటర్స్ ని పెంచారని తెలిపారు. తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.

మహిళకు సీరియస్

జింఖానా గ్రౌండ్  లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన  ఓ  మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ తొక్కిసలాటలో  మరో  20మంది గాయపడ్డారు . పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాటలో చాలా మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. 

ఉదయం నుంచే టికెట్స్ అమ్ముతున్నప్పటికీ.. బాగా ఆలస్యం జరుగుతుండటంతో అభిమానలు ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్స్ దొరుకుతాయో లేదోననే టెన్షన్.. కౌంటర్ బంద్ చేస్తారంటూ జరిగిన ప్రచారం, కేవలం 800, 1200 రూపాయల టికెట్స్ మాత్రమే అమ్మడంతో.. అభిమానుల్లో ఆందోళన పెరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి లాఠీ ఛార్జ్ దాకా వెళ్లింది.