కార్పొరేషన్లలో ప్రక్షాళన!..సరిగ్గా పనిచేయని చైర్మన్లకు ఈసారి నో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్

కార్పొరేషన్లలో ప్రక్షాళన!..సరిగ్గా పనిచేయని చైర్మన్లకు ఈసారి నో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్
  • ఆయా సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కమిటీకి సీఎం నిర్ణయం  
  • పలు కార్పొరేషన్ల చైర్మన్ల తీరుపై తీవ్ర ఆరోపణలు
  • సంస్థలను గాడిలో పెట్టకపోగా.. అక్రమాలకు పాల్పడడంపై సీరియస్ 
  • సరిగ్గా పనిచేయని చైర్మన్లకు ఈసారి నో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లను సమూలంగా ప్రక్షాళన చేయాలని సర్కార్ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా కార్పొరేషన్ల పనితీరు, చైర్​పర్సన్​ల నియమాకం తర్వాత జరిగిన మార్పులపై ఇంటెలిజెన్స్​ రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఆయా సంస్థల ప్రాధాన్యతను బట్టి పూర్తిస్థాయి కసరత్తు చేసి, రెండు విడతల్లో 39 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. తీరా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయా సంస్థలను గాడిలో పెట్టాల్సిన చైర్మన్లు, తమ బాధ్యతలను పూర్తిగా గాలికొదిలేయడంపై ప్రభుత్వం తీవ్ర అసహనంతో ఉంది. అప్పుల ఊబిలో ఉన్న సంస్థలను లాభాల బాట పట్టించాల్సింది పోయి, కనీస పర్యవేక్షణ కూడా చేయకపోవడంతో కార్పొరేషన్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పనితీరు మెరుగుపడని సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే ప్రక్షాళన చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న కార్పొరేషన్లలో కొంతమంది చైర్మన్ల తీరు మరీ దారుణంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

ముఖ్యంగా స్టేట్ సీడ్స్ డెవలప్‌‌‌‌మెంట్, అగ్రోస్, ఆయిల్ ఫెడ్ వంటి కీలక సంస్థల్లో పని చేస్తున్న సుమారు 250 మందికి పైగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఉద్యోగుల జీతాల కోసం కేటాయించిన నిధులను సైతం సదరు చైర్మన్లు తమ వ్యక్తిగత అవసరాలకు, విలాసాలకు వాడుకున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో తేలింది. స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అగ్రోస్, ఆయిల్​ఫెడ్, వేర్​హౌసింగ్ కార్పొరేషన్, ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్, పోలీస్ హౌసింగ్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్ ప్రమోషన్, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్లు, స్పోర్ట్స్ అథారిటీ వంటి వాటిల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై సీఎం రేవంత్ చాలా సీరియస్‌‌‌‌గా ఉన్నారని, సంస్థల నిధులను సొంతానికి వాడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న చైర్మన్ల జాబితా సిద్ధమైందని, వారికి రెండోసారి ఎక్స్​టెన్షన్ ఉండదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిసింది.  

పూర్తి స్థాయిలో స్టడీ చేసి నిర్ణయం..

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు నామమాత్రంగా బాధ్యతలు నిర్వహిస్తూ, సంస్థల అభివృద్ధిని విస్మరించిన ఏ ఒక్క చైర్మన్‌‌‌‌కు కూడా పదవీ కాలం పొడిగింపు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. చాలా కార్పొరేషన్​చైర్ పర్సన్​లు నెల, రెండు నెలల్లో రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఆ లోపే ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం. పదవులను అలంకారప్రాయంగా వాడుకుంటూ, అక్రమాలకు పాల్పడుతున్న వారిని సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే, ప్రతి కార్పొరేషన్ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, చర్యలను నిర్ణయించేందుకు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కమిటీ ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి, సిబ్బంది అవసరాలు, అవి అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను బేరీజు వేయనుంది. నిరుపయోగంగా ఉన్న సంస్థలను ఇతర విభాగాల్లో విలీనం చేయడం లేదా మూసివేయడం వంటివాటిపైనా నివేదిక ఇవ్వనుంది. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన చైర్మన్ల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా పాలనలో జవాబుదారీతనం తేవాలని సర్కారు చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంపై ఇటీవల కాగ్ కూడా రిపోర్ట్ ఇవ్వడంతో దీనిపై సీఎం సీరియస్​గా ఉన్నారు. దాదాపు 49  ప్రభుత్వ రంగ సంస్థలు మూడేళ్లుగా వార్షిక ఖాతాలను ఆడిట్‌‌‌‌కు సమర్పించలేదని, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటించకపోవడంతో వ్యవస్థ నీరుగారిపోయిందని కాగ్ పేర్కొంది. గత ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతున్న నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని 90కి పైగా కార్పొరేషన్లు నామమాత్రపు ఉనికికే పరిమితమయ్యాయి. మొత్తం సంస్థల్లో ఆరేడు మాత్రమే యాక్టివ్‌‌‌‌గా పని చేస్తుండగా, మిగిలినవన్నీ నిధులు లేక, పథకాలు లేక అచేతనంగా ఉన్నాయి.