
- ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- మంత్రి దామోదర ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ
- పది రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఐవీఎఫ్ సెంటర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో సృష్టి వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఐవీఎఫ్ క్లినిక్‌లలో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూకు మంత్రి సూచించారు.
దీంతో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈఓ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌లతో కమిటీని నియమిస్తూ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తనిఖీల ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీని సెక్రటరీ ఆదేశించారు. నివేదిక ఆధారంగా ఆయా ఫర్టిలిటీ సెంటర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కమిటీ నేతృత్వంలోని బృందాలు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) రెగ్యులేషన్ యాక్ట్, 2021, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, 2021 నిబంధనలను ఉల్లంఘిస్తున్న సెంటర్లను గుర్తించనున్నారు. అలాగే పేషెంట్ సమ్మతి, గామెట్ సోర్సింగ్, ప్రొసీజర్ డాక్యుమెంటేషన్‌లో పారదర్శకతను పరిశీలించనున్నారు.