జీవోలు, పాలసీలన్నీ సాగర్ ఓటుకే సూటి పెట్టిన సర్కార్

జీవోలు, పాలసీలన్నీ సాగర్ ఓటుకే సూటి పెట్టిన సర్కార్
  • వడ్లు కొనబోమని మొన్నటిదాక చెప్పి.. ఇప్పుడు గ్రీన్​సిగ్నల్​
  • డిగ్రీ కాలేజీ, నెల్లికల్​ లిఫ్ట్​ ఇరిగేషన్​కు స్పీడ్​గా పనులు
  • నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేల మకాం
  • ఊరూరా లిక్కర్, డిన్నర్లు..ఓటర్లకు భారీగా కానుకలు
  • కుల సంఘాలతో స్పెషల్​ మీటింగ్​లు, ప్యాకేజీలు
  • ఇతర పార్టీల లీడర్లకు ఆఫర్లతో వల.. వినకుంటే బెదిరింపులు, కేసులు 

హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: గెలిచి తీరడమే లక్ష్యంగా నాగార్జునసాగర్​ ఉప ఎన్నికపై టీఆర్​ఎస్​  స్పెషల్​ నజర్​ పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, జారీ చేసే ప్రతి జీవోను నాగార్జునసాగర్ ఓటుకే  సూటి పెట్టింది. ఎలక్షన్​ షెడ్యూల్​కు ముందే సీఎం కేసీఆర్ హాలియాలో సభ నిర్వహించి.. ఈ సెగ్మెంట్​పై పాత హామీలన్నీ మళ్లీ  కురిపించారు. దాదాపు రూ. 200 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, పథకాలన్నీ ఆగమాగం అమల్లోకి తెచ్చారు.  

సెలూన్లకు ఫ్రీ పవర్​

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తగిలిన షాక్​తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో  నేరుగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్​..  సాగర్​ ఎన్నికను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే  గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా అమలు చేస్తున్నారని టీఆర్​ఎస్​ వర్గాలు అంటున్నాయి.  2018 ఎన్నికల టైమ్ లోనే  సెలూన్లకు ఫ్రీ పవర్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ రెండున్నరేండ్లుగా దీన్ని అమలు చేయలేదు. సాగర్ లో దాదాపు 5 వేల మంది నాయీ బ్రాహ్మణ ఓట్లు ఉండటంతో ఇప్పుడు ఫ్రీ పవర్ ను అమలు చేస్తూ జీవో జారీ చేశారు. 

వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఓకే

గతంలో వడ్లు కొనబోమని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ, ఇప్పుడు సాగర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది ఓటర్లు రైతులేనని గ్రహించి వడ్ల కొనుగోలు కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారు. 

కాలేజీ, ఇరిగేషన్​ ప్రాజెక్టుకూ ఓ లెక్క

నోముల నర్సింహయ్య చాలా సార్లు డిగ్రీ కాలేజీ కావాలని లెటర్ల మీద లెటర్లు ఇచ్చినా స్పందించలేదు. కానీ ఆయన మరణించిన తర్వాత డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేశారు. చాలా కాలంగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని స్థానిక రైతుల నుంచి డిమాండ్ ఉన్నా పట్టించుకోని సర్కారు ఉప ఎన్నిక తప్పదని తెలిసి ఆ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

టూరిజం హోటల్ కేంద్రంగా వ్యూహాలు

నాగార్జునసాగర్‌లోని టూరిజం హోటల్ కేంద్రంగా టీఆర్ఎస్  రాజకీయాలు జోరందుకున్నాయి.  ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మెజార్టీ ఎమ్మెల్యేలు అక్కడే బస చేస్తున్నారు. పార్టీకి ప్రతికూలంగా ఉన్న ఊళ్లలోని లీడర్లను ప్రతి రోజూ రాత్రి హోటల్​కు  పిలిచి మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇందులో ప్రతిపక్షాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలను పిలిపించుకొని, వారి హోదాకు తగ్గట్టు ప్యాకేజీలు ఇస్తున్నట్టు టీఆర్ఎస్  లోకల్​ లీడర్లు చెప్తున్నారు. ప్రత్యేకంగా తమ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి చేపట్టే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటే చాలన్న కోణంలో ప్యాకేజీలు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మాట వినని లీడర్లను బెదిరించి దారిలోకి తెచ్చుకుంటున్నట్టు, అయినా దారిలోకి రాకుంటే  పాత కేసులు పెడ్తామని పోలీసులు నుంచి కాల్స్  చేయిస్తున్నట్టు  ఆరోపణలు వస్తున్నాయి. 

టీఆర్​ఎస్​ అభ్యర్థి నోముల భగత్​కు మద్దతుగా కుల సంఘాల లీడర్లు ప్రకటనలు చేస్తే  రూ. అర కోటి, నేరుగా నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే రూ. కోటి వరకు ప్యాకేజీ ఇస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. సాగర్ లో అధికంగా ఓట్లు ఉన్న బీసీ కులాల లీడర్లకు ఫోన్లు చేసి ప్యాకేజీలు ఆఫర్​ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కుల సంఘాలు, లీడర్ల హోదా మేరకు ప్యాకేజీల్లో తేడాలున్నాయని లీడర్లు చెప్తున్నారు. ఇప్పటికే పలు బీసీ సంఘాలు తమకు సపోర్టు తెలిపినట్లు టీఆర్​ఎస్​ సీనియర్  లీడర్  ఒకరు అన్నారు. తమ తమ కులాల ఓటర్లను కలిసి ఓట్లు వేయించాల్సిన బాధ్యతను కుల సంఘాల లీడర్లకు అప్పగిస్తున్నారు. గ్రామాల వారీగా కుల సంఘాల మీటింగ్​లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నెలన్నరగా ఎమ్మెల్యేల మకాం

సాగర్​లో కులాలవారీగా ఎమ్మెల్యేలకు టీఆర్​ఎస్​ బాధ్యతలు అప్పగించింది. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు నెలన్నరగా ఇక్కడే ఉంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా సాగర్​లో మకాం వేశారు. లోకల్​గా ఉండే పార్టీ బలహీనతలను గుర్తించి సరిచేస్తున్నారు. వీరంతా విందులు, కుల భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రెండు ఎమ్మెల్సీ సీట్లు తమ ఖాతాలో పడటంతో ఇక సాగర్​లో గెలిస్తే ఢోకా ఉండబోదని మంత్రులు  ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజుకో మంత్రిని ప్రచార పర్యటనకు పార్టీ పంపిస్తోంది. మనీ, లిక్కర్​, విందులతో ఓటర్లను టీఆర్​ఎస్​ లీడర్లు  ప్రలోభపెడుతున్నట్లు  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సపోర్ట్ చేయాలంటూ ఇతర పార్టీల నేతలను లోబర్చుకుంటున్నారని, పదవుల ఆశచూపి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ పదవులు ఎరవేసి ఇద్దరు బీజేపీ లీడర్లను పార్టీలో చేర్చుకున్న టీఆర్​ఎస్.. గ్రామాలకు నిధులు ఇస్తామని సర్పంచులపై  వల విసురుతోంది.