అవినీతి బయటపడుతుందనే..సభ నుంచి పారిపోయారు : జూపల్లి కృష్ణారావు

అవినీతి బయటపడుతుందనే..సభ నుంచి పారిపోయారు : జూపల్లి కృష్ణారావు
  •     మైక్ ఇవ్వలేదని బీఆర్ఎస్​ లీడర్లు వాకౌట్​ చేయడం విడ్డూరం: మంత్రులు జూపల్లి, వాకిటి
  •     కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి పారిపోయారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆరోపించారు. కృష్ణా జలాలు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పీకర్​తమకు మైక్​ ఇవ్వలేదన్న సాకు చూపించి బీఆర్ఎస్​ నేతలు వాకౌట్​చేయడం అంటే.. వారు పలాయనం చిత్తగించడమేనని ఎద్దేవా చేశారు. 

శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద ఎమ్మెల్యేలు వీర్లశంకర్, మధుసూదన్​రెడ్డి, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డితో కలిసి వారు మాట్లాడారు. మూసీప్రక్షాళన ప్రాజెక్టుపై జరిగిన చర్చలో తమను మాట్లాడనివ్వలేదంటూ బీఆర్ఎస్​డిప్యూటీ ఫ్లోర్​లీడర్లు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​యాదవ్​, ఇతర ఎమ్మెల్యేలంతా సభనుంచి వాకౌట్ ​చేసి అసెంబ్లీ బయట ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి విమర్శంచారు. 

మైక్​ ఇవ్వలేదన్న ఒక్క సాకుతో మొత్తం సెషన్​ను బాయికాట్​చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయా ప్రాజెక్టులపై బయట మాట్లాడేకంటే సభలో చర్చిద్దామని సీఎం చెప్పినా.. బీఆర్ఎస్​ నేతలు కేవలం రాజకీయం చేస్తున్నారని జూపల్లి ఆరోపించారు. బీఆర్ఎస్​నాయకులు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే మాత్రమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు.