వ్యవసాయ శాఖలో కొత్త పోస్టులు

వ్యవసాయ శాఖలో కొత్త పోస్టులు
  • త్వరలో నోటిఫికేషన్ వచ్చే చాన్స్
  • కొత్త రైతు వేదికలు, ల్యాబ్​లు కూడా

హైదరాబాద్, వెలుగు: ఫీల్డ్ లెవల్‌లో కీలకమైన అగ్రికల్చర్ ఎక్స్​టెన్షన్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 439 క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన అధికారులను నియమించాలని డిసైడ్​ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారికి జాబ్స్ అవకాశం రానుంది. పోస్టులతో పాటు క్లస్టర్‌లు, రైతు వేదికలు, సాయిల్ హెల్త్ పరీక్షల కోసం ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మార్చిలో ప్రకటించే బడ్జెట్‌లో కొలువుల ప్రకటన చేసే అవకాశం ఉందని అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ వర్గాలు అంటున్నాయి. 

కొత్తగా క్లస్టర్‌లో మార్పులు.. 

రాష్ట్రవ్యాప్తంగా 2,601 క్లస్టర్లు ఉన్నాయి. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలన్నది ఉద్దేశం కాగా.. అంటే మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఈ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. దీంతో శాస్త్రీయత లోపించడంతో క్లస్టర్ల వారీగా రైతులు ఏ పంటలు వేస్తున్నారు.. ఎన్నెకరాల్లో పండిస్తున్నారు.. తదితర వివరాలు సేకరించడంలో  రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వడంలో గ్రౌండ్​ లెవల్​లో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్లస్టర్ల వారీగా సాగు భూముల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. 5 వేల ఎకరాలకు పైగా 1,592 మంది, 10 వేల ఎకరాలకు పైగా 116 మంది, 12 వేల ఎకరాలకు పైగా 44 మంది, 15 వేల ఎకరాలకు పైగా 13 మంది ఏఈవోలు, కొందరికి  ఏకంగా 18 వేల ఎకరాలు భూములున్న క్లస్టర్‌లో ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏఈఓ పరిధిలో ఏకంగా 18 వేల ఎకరాలున్నాయి. చేయాల్సిన దానికి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో సమస్య ఏర్పడుతోంది. మరికొన్నిచోట్ల వందల ఎకరాల్లోనే క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో క్లస్టర్లను శాస్త్రీయంగా రూపొందించి అన్నింటినీ ప్రక్షాళన చేసి భూముల పరిధిని సంస్కరించనున్నారు. 5 వేల ఎకరాలు చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మార్పులు చేయడంతో పాటు కొత్తగా 439 క్లస్టర్లు అవసరమని గుర్తించారు. ఈ క్లస్టర్లకు అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రపోజల్స్ పంపింది.

క్లస్టర్లతో పాటు రైతు వేదికలు, ల్యాబ్‌లు..

రాష్ట్రంలో ప్రతీ క్లస్టర్‌లో ఒక రైతు వేదికను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ప్రతిపాదనలకు సర్కారు ఓకే చెప్తే కొత్తగా క్లస్టర్ల ఏర్పాటుతో రైతు వేదికలు కూడా పెరిగే చాన్స్​ ఉంది. క్లస్టర్లకు అనుగుణంగా రైతు వేదికల నిర్మాణం జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా రైతు వేదికల్లోనే భూసార పరీక్షల కోసం ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.