3 జిల్లాల పరిధిలో 509 ప్లాట్లు, 18 ఎకరాల భూములు

3 జిల్లాల పరిధిలో 509 ప్లాట్లు, 18 ఎకరాల భూములు

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లు, ఓపెన్ ల్యాండ్స్ ను విక్రయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 14న వివిధ శాఖల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం19 ప్రాంతాల్లోని 2,346 ప్లాట్లు, 458 ఇండ్లతోపాటు 25 ఎకరాల 40 గుంటల ఓపెన్ ల్యాండ్స్ ని విక్రయిస్తోంది. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 8 ప్రాంతాల్లోని 509 ప్లాట్లు,18 ఎకరాల భూములు ఉన్నాయి. హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటికే ఈ 8 ప్రాంతాలకు సంబంధించి మూడు చోట్ల ఫ్రీ బిడ్డింగ్​సమావేశాలు నిర్వహించారు. ఒక్కో సమావేశానికి 100 మందికి పైగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కురుమాల్ గూడలో 110 ప్లాట్లతో హెచ్ఎండీఏ లేఅవుట్ చేసింది. బహూర్ పల్లిలో లేఅవుట్ లో గతంలో కొన్ని ప్లాట్లు విక్రయించగా, మిగిలిన 87 ప్లాట్లను ఇప్పుడు విక్రయానికి పెట్టింది. తొర్రూరులోని హెచ్ఎండీఏ లేఅవుట్ లో సెకండ్ ఫేజ్ కింద 145 ప్లాట్లను అమ్మకానికి పెట్టగా శనివారం వీటికి సంబంధించిన  ప్రీ బిడ్ మీటింగ్ లేఅవుట్ సైట్ వద్దే నిర్వహించారు. సిటీకి ఆనుకొని ఉండడంతో ఈ ప్రాంతాల్లోని ప్లాట్లు కొనేందుకు ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్​వ్యాపారులు కూడా వేలంలో దక్కించుకునేందుకు చూస్తున్నారు. 

ఏరియాని బట్టి...

మూడు జిల్లాల్లోని ప్లాట్లతోపాటు ఓపెన్ ల్యాండ్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం ప్లాట్లు అయితే ప్రాంతాన్ని బట్టి చదరపు గజాన్ని రూ.10 వేల నుంచి 40 వేలకు విక్రయిస్తోంది. వికాబాబాద్​లోని రెండు ప్రాంతాల్లో ఎకరం భూమిని రూ.59 లక్షలకు అమ్ముతోంది. రియల్టర్లు కూడా వేలంలో భూములు, ప్లాట్లను దక్కించుకునేందుకు రెడీ అయ్యారు. ముందు కొని డిమాండ్​పెరిగాక ఎక్కువకు అమ్ముకోవచ్చని ప్లాన్​చేస్తున్నారు. ఈసారి ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని చెప్పుకుంటున్నారు. 

ఎక్కడెక్కడ ఎంత రేటు ఉందంటే?

మొత్తం 8 ప్రాంతాల్లో నాలుగు చోట్ల హెచ్ఎండీఏ, రెండు చోట్ల కలెక్టర్లు, మరో రెండు చోట్ల టీఎస్​ఐఐసీ అధికారులు వేలం నిర్వహించనున్నారు. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లిలో గతంలో వేలం నిర్వహించగా 109 ప్లాట్లు మిగిలాయి. ఇప్పుడు వాటిని చదరపు గజం రూ.25 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కుర్మాలగూడ లేఅవుట్ లో 142 ప్లాట్లను చదరపు గజం రూ.10 వేలు లెక్కన, తొర్రూరులోని 145 ప్లాట్లను చదరపు గజాన్ని రూ.20 వేల చొప్పున అమ్ముతున్నారు. తుర్కయాంజల్ లోని 16 ప్లాట్లను చదరపు గజం రూ.40 వేల లెక్కన అమ్మకానికి పెట్టారు. చందానగర్ లో చదరపు గజం రూ.40 వేలు చొప్పున మూడు ప్లాట్లు, కవాడిపల్లిలో రూ.10 వేల చొప్పున 94 ప్లాట్లకు టీఎస్​ఐఐసీ అధికారులు వేలం నిర్వహించనున్నారు. ఇక వికారాబాద్ జిల్లా అలంపల్లిలోని 15 ఎకరాలు, గంగారంలో మూడున్నర ఎకరాల ఓపెన్​ల్యాండ్​ఉంది. ఇక్కడ ఎకరం రూ.59 లక్షల చొప్పున విక్రయించేందుకు అధికారులు రెడీ అయ్యారు.