ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
  • ప్రజాభిప్రాయం పట్టించుకోని ఆఫీసర్లు
  • వరద బాధితులకు సాయం పేరిట హడావుడి

భద్రాచలం, వెలుగు: గోదావరి వరద బాధిత కుటుంబాలకు సాయం పేరుతో సర్కారు హడావుడి చేస్తోంది. ఎక్కడా ప్రజాభిప్రాయం తీసుకోకుండా, ప్రణాళికల్లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. జులై 17న భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్​ రూ.1000 కోట్లతో ఎత్తైన ప్రదేశంలో ముంపు కాలనీవాసులకు ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని పక్కన పెట్టి వ్యక్తిగత ఇండ్లు కాకుండా కాంప్లెక్స్ కట్టి చేతులు దులుపుకొనే పనిలో పడ్డారు.

కరకట్టలు ఎత్తు పెంచడంతో పాటు పటిష్ట పర్చాలని, స్లూయిజ్​ ఏర్పాటు చేసి టౌన్​లో డ్రైనేజీ సిస్టమ్​ మార్చాలని వరద ముంపు బాధితులు కోరుతుంటే 2016 డబుల్​బెడ్రూం ఇండ్లతో కాంప్లెక్స్ కట్టిస్తామని ఆఫీసర్లు భద్రాచలంలో హడావుడి చేస్తున్నారు. సర్వేల పేరుతో ముంపు బాధితుల నుంచి డిక్లరేషన్​ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

స్కూలు పక్కకు మాంసం మార్కెట్..​

డబుల్​బెడ్రూం ఇండ్లతో కాంప్లెక్స్ నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్, పంచాయతీకి చెందిన కొత్త మార్కెట్​లో స్థలాలను కలెక్టర్​ అనుదీప్​ కేటాయించారు. కొత్త మార్కెట్​లోని మాంసం మార్కెట్​కు చెందిన 55 దుకాణాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇదే కాంప్లెక్స్​లో  కొర్రాజులగుట్ట నన్ననపునేని మోహన్​ హైస్కూల్​ పక్కకు వీటిని తరలిస్తున్నారు. ఇందుకు పంచాయతీ సిబ్బంది ముగ్గు కూడా పోశారు.

కాగా మాంసం మార్కెట్​ కోసం మూడేళ్ల క్రితం రూ.కోటి వ్యయంతో పంచాయతీ సీసీ రోడ్లు, డ్రైన్లు, నీటి వసతి, కబేలా తదితర వసతులు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ నిధులన్నీ దుర్వినియోగం అయినట్లే. మరోవైపు స్కూలు పక్కకు మాంసం మార్కెట్​ తరలింపుపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నాయి. 1000 మందికి పైగా విద్యార్ధులు చదువుతున్న స్కూలు పక్కకి మాంసం మార్కెట్​ తీసుకొస్తే దుర్వాసనతో పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ జెండాలు

సత్తుపల్లి, వెలుగు: పట్టణంలోని విరాట్ నగర్ లో పూడ్చి వేసిన పాత ఎన్టీఆర్ కాలువ ప్రభుత్వ భూమిలో టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో స్థానికులు కాంగ్రెస్ జెండాలు పాతారు. పట్టణంలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేసినా స్పందించకపోవడంతో గాంధీ జయంతి సందర్భంగా జెండాలను పాతినట్లు ఆయన తెలిపారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంకట వీరయ్య ఏ ఒక్కరికీ ఇంటి జాగా ఇవ్వలేదని విమర్శించారు. రావి నాగేశ్వరరావు, గాదె చెన్నకేశవరావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, నాగేంద్రాచారి, మానుకోట ప్రసాద్, ఫజల్ బాబా, ఐ కృష్ణ, కంభంపాటి కాంతారావు,షేక్ బాజి, షేక్ ఖలీల్, సయ్యద్ ఖలీల్, యూసఫ్ పఠాన్, దేవప్రియుడు, పచ్చినేళ్ల శ్రీను, వాసు, పున్నమ్మ,పెద్ద భూభమ్మ, సుజాత, లక్ష్మీ, గులాం నబి, యాకూబ్  పాల్గొన్నారు.

‘అంతిమ విజయం న్యాయానిదే’

అశ్వారావుపేట, వెలుగు: రాజకీయపరంగా ఒడిదిడుకులు వచ్చినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం చాంబర్  ఆఫ్  కామర్స్  నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. అధ్యక్షుడిగా సంకా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కాకి నరసరావుతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అశ్వారావుపేటకు నేషనల్  హైవే రాదనే అనుమానాలు వద్దని చెప్పారు. నాయకులు సమన్వయంతో పని చేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాంమూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, మహిపాల్, వెంకటేశ్వరరావు, సర్పంచులు అట్టం రమ్య, నార్లపాటి సుమతి, ప్రకాశ్,రవి పాల్గొన్నారు.

ప్రమాదంలో కార్మిక చట్టాలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని

నేలకొండపల్లి,వెలుగు: ప్రతి కార్మికుడికి ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ 16వ మహాసభలు ఆదివారం నేలకొండపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలు ప్రమాదంలో పడ్డాయని, ఇప్పటికే 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం సవరించిందని చెప్పారు. కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రధానులు ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రైవేట్​ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేశ్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కర్నాటి భానుప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బిజి క్లెమెంట్, యర్రాబాబు, సీహెచ్ సీతామహాలక్ష్మీ పాల్గొన్నారు.

అమ్మకానికి సిద్ధంగా తీరొక్క పూలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సద్దుల బతుకమ్మ సందర్భంగా తీరొక్క పూలను అమ్ముకునేందుకు గ్రామీణులు పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని రైల్వే అండర్​ బ్రిడ్జి ప్రాంతం నుంచి సూపర్​బజార్​ సెంటర్, రైల్వే స్టేషన్​ వరకు రోడ్డుకు ఒక పక్క చీరలు, రాళ్లు, చెట్ల కొమ్మలతో ఆదివారం ఉదయం నుంచే జాగాలను ఆపుకున్నారు. తంగేడు పూలకు డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో బాగా రేటు పలికింది. 

అడవిపందిని ఢీకొట్టిన మోపెడ్

మున్సిపల్​ కార్మికురాలి మృతి

పాల్వంచ, వెలుగు: మండలంలోని నాగారం కాలనీ వద్ద రోడ్డుపైకి వచ్చిన అడవి పందిని మోపెడ్​ ఢీకొనడంతో మున్సిపల్​ కాంట్రాక్టు కార్మికురాలు పడాల అన్నపూర్ణ(38) చనిపోయింది. కూనవరం మండలం మర్రిగూడెం గ్రామానికి కూతురితో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా పంది అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది.  తల్లి, కూతురు కింద పడగా అన్నపూర్ణ తలకు బలమైన గాయమైంది. ముందుగా పాల్వంచ ఆసుపత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఫారెస్ట్  ఆఫీసర్లపై క్రిమినల్ కేసు పెట్టాలి

అశ్వారావుపేట, వెలుగు: పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళలపై దాడి చేసిన ఫారెస్ట్  ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీపీసీసీ మెంబర్ సున్నం నాగమణి డిమాండ్ చేశారు. ఫారెస్ట్​ ఆఫీసర్ల దాడిలో గాయపడిన మండలంలోని వాగోడ్డుగూడెం గ్రామానికి చెందిన సావిత్రి, లక్ష్మి, మహాలక్ష్మి, వెంకమ్మలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. మీడియాపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవరావు, పాండురంగ, దేవరాజు, రామకృష్ణ, సత్యం పాల్గొన్నారు.

సరస్వతీ దేవిగా పెద్దమ్మతల్లి

పాల్వంచ,వెలుగు: దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లి అమ్మవారు ఆదివారం సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులతో సరస్వతీ పూజ, అక్షరాభ్యాసం నిర్వహించారు. సింగరేణి జీఎం వల్లి సుబ్బారావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
తాడేపల్లిగూడెం కళాకారులతో హరికథ కార్యక్రమాన్ని నిర్వ హించారు.  

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం,వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష్మీతాయారు అమ్మవారు ఆదివారం ఐశ్వర్యలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం గర్భగుడిలో శ్రీసీతారామచంద్రలక్ష్మణస్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం తర్వాత బాలబోగం నివేదించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు.

లక్ష్మీతాయారు మూలమూర్తికి అభిషేకం చేసి ఉత్సవమూర్తిని ఐశ్వర్యలక్ష్మిగా అలంకరించారు. సామూహిక కుంకుమార్చన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన జరిగింది. దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భద్రాద్రి రామయ్యతో పాటు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాకార మండపంలో సీతారామచంద్రస్వామికి నిత్య కల్యాణం జరిగింది. 102 మంది భక్తులు కంకణాలు ధరించి సీతారామయ్యకు కల్యాణం నిర్వహించారు.

చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణం యుద్దకాండ పారాయణం చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన భక్తులు శ్రీసీతారామచంద్రస్వామికి భారీగా విరాళాలు ఇచ్చారు. యార్లగడ్డ వెంకటేశ్వర్లు, సీతమ్మల జ్ఞాపకార్థం కుమార్తె వెలగపూడి సత్యవాణి, అల్లుడు రాధాకృష్ణ గోశాల నిర్మాణానికి రూ.5లక్షలు, శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్ నిరంజన్​కుమార్​కు ఈ విరాళాన్ని అందజేశారు.

ఘనంగా బతుకమ్మ వేడుక

తల్లాడ, వెలుగు: మండలకేంద్రంలోని లూర్దు మాత హైస్కూల్​లో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడకలకు సీపీ విష్ణు ఎస్  వారియర్  హాజరయ్యారు. హైస్కూల్ నుంచి బతుకమ్మలతో ర్యాలీగా తరలివచ్చారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్​ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​తో భేటి

ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్​ను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారంతో పాటు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్  కల్పిస్తూ జీవోలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.

రైతు బజార్ లో వివాదం

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని రైతు బజార్ లో తన అమ్మ పేరుతో స్టాల్ కేటాయించినా దళారులు కూర్చొని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ చింతకాని మండలం కిష్టాపురం విలేజ్ కు చెందిన మధు ఆదివారం అమ్మేందుకు తెచ్చిన కూరగాయలను రోడ్డుపై పోసి నిరసన తెలిపాడు. రైతు బజార్ లో ఎస్టేట్ ఆఫీసర్ దళారులకు ఆశ్రయం కల్పించడంతోనే అసలైన రైతులను న్యాయం జరగడం లేదని వాపోయాడు.

స్వచ్ఛ సర్వేక్షణ్​​ అవార్డు అందుకున్న కలెక్టర్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కలెక్టర్​ అనుదీప్  ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్​ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్​​ జాతీయ అవార్డును అందుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలవడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి అవార్డును జిల్లా దక్కించుకోవడం హర్షణీయమని కలెక్టర్​ తెలిపారు.  ప్రజాప్రతినిధులు, ప్రజలతో పాటు పంచాయతీ సెక్రటరీలు, పారిశుధ్య సిబ్బంది, అధికారుల కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని చెప్పారు. 

ఆకట్టుకున్న స్వరనీరాజనం

భద్రాచలం, వెలుగు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలోని కేకే ఫంక్షన్​హాలులో ఆదివారం స్వర నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ రోహిత్​ రాజు, ఐటీసీ కాంట్రాక్టర్​ పాకాల దుర్గాప్రసాద్​ తదితరులు ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం బాలసుబ్రహ్మణం పాడిన గీతాలను సింగర్లు ఆలపించారు. 

బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి

సత్తుపల్లి, వెలుగు: పట్టణంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్​ తెలిపారు. అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మహిళలు హాజరవుతారని చెప్పారు.  తామరచెరువు వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.