రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు2 వేల మందికి ఉపాధి కల్పించే సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ప్రభుత్వం తీరుతో సంక్షోభంలో పడింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రపంచ కార్మిక దినోత్సమైన మేడే రోజున సిరిసిల్లలో 112 యూనిట్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లాయి. దీంతో వేల మంది ఉపాధికి దూరమయ్యారు.
ఇదీ జరిగింది...
18 ఏండ్లకు ముందు సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఉపాధి లేక ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇలా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు గుర్తించింది. కేంద్ర మంత్రిగా ఉన్న సీహెచ్ విద్యాసాగర్‌రావు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌కు పునాదులు వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 2002 నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో సుమారు 1200 మంది ప్రత్యక్షంగా, 2 వేల మంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్వయానా ముఖ్యమంత్రి కొడుకే మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉండడంతో అన్ని సమస్యలు తీరతాయని భావించారు. కానీ, కష్టాలు అలాగే కొనసాగుతున్నాయి.
దెబ్బతీసిన బతుకమ్మ ఆర్డర్లు
టెక్స్టైల్ పార్క్‌లో 230 ఫ్లాట్స్అలాట్ చేయగా కేవలం 112 యూనిట్లు మాత్రమే మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రైవేట్ ఆర్డర్లు తీసుకొని నడిపించగా లాభాల బాటలో పయనించాయి. మరింత అభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో టెక్స్టైల్స్ పరిశ్రమల యజమానులు సంబురపడ్డారు. దీంతో ముంబయి, మహారాష్ట్రల నుంచి వచ్చే ప్రైవేట్ఆర్డర్లను రద్దు చేసుకున్నారు. తర్వాత టెక్స్టైల్ పార్క్‌లో బతుకమ్మ చీరల ఆర్డర్లను రద్దు చేస్తూ చేనేత, జౌళిశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో టెక్స్టైల్ పార్క్ యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రైవేట్ ఆర్డర్ల కోసం ప్రయత్నిస్తే వారు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు ఇచ్చుకున్నామని చెప్పడంతో హతాశులయ్యారు. రంజాన్, రాజీవ్‌విద్యా మిషన్, ఇతర ఆర్డర్లు వచ్చినా వాటితో వారం రోజులు కూడా పని ఉండడడం లేదు. దీనికి తోడు పరిశ్రమలపై విద్యుత్ చార్జీల భారం పడింది. రాయితీ ఇస్తామన్న కేటీఆర్ మాట నిలబెట్టుకోలేకపోయారు. రూ.3.75 యూనిట్ విద్యుత్‌చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.8 చేశారు. తమిళనాడులో టెక్స్టైల్ పరిశ్రమకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, ఇక్కడ మాత్రం అమలు చేయడం లేదు. పట్టణంలో వస్త్ర పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తుండగా పక్కనే ఉన్న టెక్స్టైల్ పరిశ్రమకు వర్తింపజేయడం లేదు. దీనికి తోడు యారన్, ముడి సరుకుల ధరలు నాలుగు రెట్లు పెరగడం, పార్క్‌లో తయారైన గుడ్డకు మార్కెట్ లేకపోవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. అలాగే టెక్స్టైల్ పార్క్ ప్రారంభించి 18 ఏండ్లు కావస్తున్నా తాగునీటి వసతి కూడా లేదు. టెక్స్టైల్ పార్క్‌లో కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు వెచ్చించినా ఉపయోగంలోకి రాలేదు. టెక్స్టైల్ పార్క్యజమానుల సంఘం తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేడే రోజునే నిరవధిక సమ్మెలోకి వెళ్లారు.
మూతపడ్డ పరిశ్రమలను తెరవాలె
నేతన్నలకు ఉపాధి చూపెట్టడానికి ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్క్ సంక్షోభంలో మునిగి పరిశ్రమలు మూతపడుతున్నాయి. చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ చెబుతున్నారు గానీ, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి.
– కోడం రమణ, పవర్ లూమ్ వర్కర్స్‌యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ
సమస్యలు పరిష్కరిస్తేనే విరమణ
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో సమస్యలు పేరుకుపోయాయి. విద్యుత్‌చార్జీల భారం విపరీతంగా పడుతోంది. దీనికి సంబంధించిన రీయింబర్స్మెంట్ ఇప్పించాలి. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. పార్క్‌లో నడుస్తున్న యూనిట్ల అప్‌గ్రేడేషన్ కోసం 25 శాతం రాయితీ ఇవ్వాలి. 18 ఏండ్ల పరిశ్రమలో కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్సీ) కూడా లేదు. టెస్కో ఇస్తున్న బతుకమ్మ ఆర్డర్లు 25 శాతం టెక్స్టైల్ పార్క్కే ఇవ్వాలి. పార్క్‌లోని యార్న్ బ్యాంకును వెంటనే పునరుద్ధరించాలి. రూ.2 కోట్లతో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్ తిరిగి తెరిపించాలి. – అన్నల్దాస్ అనిల్, అధ్యక్షులు. టెక్స్టైల్ పార్క్ కమిటీ అధ్యక్షుడు
