తమను విధుల్లోకి తీసుకోవాలన్న ఫీల్డ్ అసిస్టెంట్లు

తమను విధుల్లోకి తీసుకోవాలన్న ఫీల్డ్ అసిస్టెంట్లు

 

  •     జాబ్​ నుంచి తొలగించి రెండేండ్లు
  •     అప్పటి నుంచి ఆందోళన చేస్తున్న ఎఫ్​ఏలు
  •     రోడ్డున పడిన 7,651 కుటుంబాలు
  •     8 వారాల్లోగా విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 7,651 మంది ఉపాధి హామీ  ఫీల్డ్ అసిస్టెంట్లను సర్కారు విధుల నుంచి తొలగించి రెండేండ్లు కావోస్తుంది. వీరంతా అప్పటినుంచి పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 4779/2019 జీవోకు వ్యతిరేకంగా సమ్మె చేశారన్న సాకుతో సర్కారు వీరిని మూకుమ్మడిగా సస్పెండ్ చేసింది. వీరి పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పింది. తమను విధుల్లోకి తీసుకోవాలని వీరు ఉద్యమిస్తూనే మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు ఫీల్డ్ అసిస్టెంట్లు చేసే పని తమకు అప్పజెప్పటం వల్ల  ఒత్తిడి పెరుగుతోందని పంచాయతీ సెక్రటరీలు చెబుతున్నారు. నిజానికి గ్రామ స్థాయిలో సెక్రటరీలకు చాలా పనులుంటాయి.  ఉపాధి హామీ పనుల నుంచి తమను తప్పించాలని వీరంతా మంత్రులు, అధికారులను కలిసి కోరుతున్నారు. 

ప్రత్యామ్నాయ నియామకాలు?

ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో  సీనియర్ మేట్​లను తీసుకునే ప్రాసెస్  ఇప్పటికే స్టార్ట్ అయిందని అంటున్నారు. దీనిపై పంచాయతీ రాజ్ నుంచి జిల్లా అధికారులకు  మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. సీనియర్​ మేట్స్​ను  సర్పంచ్​లు, అధికారులు రెఫర్​ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే తమ పరిస్థితి ఏంటని  ఫీల్డ్  అసిస్టెంట్లు ఆవేదన 
వ్యక్తం చేస్తున్నారు. 

విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు

విధుల్లోంచి తొలగించటంపై ఫీల్డ్ అసిస్టెంట్లు  హైకోర్టును ఆశ్రయించారు. ఎనిమిది  వారాల్లోపు వారిని విధుల్లోకి తీసుకోవాలని రెండు నెలల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ గడువు ముగిసినా విధుల్లోకి తీసుకోవటంలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు అంటున్నారు.