సర్కారు ఖర్చుల కోసం భూముల వేలం!

సర్కారు ఖర్చుల కోసం భూముల వేలం!
  • జిల్లాల్లో విలువైన భూముల గుర్తింపు షురూ
  • ప్రాజెక్టుల కోసం ఇప్పటికే భారీగా రుణాలు
  • సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల వ్యయం
  • కొత్తగా మరిన్ని అప్పులకు వీల్లేని పరిస్థితి
  • అందుకే ఇతర ఆదాయ మార్గాలపై నజర్!

హైదరాబాద్, వెలుగు:  నిధుల కొరతతో కటకటలాడుతున్న టీఆర్ఎస్​ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను అమ్మేయాలని యోచిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటికే భారీగా రుణాలు తీసుకోవడం, సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు అవసరం కావడం, కొత్తగా మరిన్ని అప్పులు చేసేందుకు వీల్లేని పరిస్థితి ఉండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంతగా భారీగా నిధులు వచ్చే అవకాశం లేకపోవడం కూడా దీనికి కారణమని అంటున్నాయి. రాజధాని ప్రాంతమైన ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు కరీంనగర్, మెదక్​ తదితర జిల్లాల్లోనూ ప్రభుత్వం భూములను వేలం వేయనున్నారని.. రూ.10 వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని సర్కారు పెద్దలు భావిస్తున్నారని సమాచారం. వివిధ జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని సీఎం కేసీఆర్  ఇప్పటికే రెవెన్యూ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్​ పరిధిలో ముందు..

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్న భూములను ముందుగా వేలం వేసేందుకు టీఎస్ఐఐసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో 40 ఎకరాలు, రాయదుర్గంలో 180 ఎకరాల సర్కారు భూములను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ పరిసరాల్లో ఎకరం భూమి రూ.25 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పలుకుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను ప్రారంభిస్తుండటంతో డిమాండ్​ పెరిగింది. ఇటీవలే అమెజాన్  క్యాంపస్​ ప్రారంభం కావటం, ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ తన ఆర్​ అండ్​డీ సెంటర్ ను ప్రారంభిస్తోంది. అందరిచూపూ ఇటువైపు పడిన ప్రస్తుత సమయం భూముల వేలం పాటకు కరెక్టని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్రం నుంచి ఆశించినంత రాక..

ఈ ఏడాది జులై లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర సర్కారు ఆశించిన మేర కేటాయింపులు దక్కలేదు. రాష్ట్ర పన్నులు, జీఎస్టీలో వాటా విషయంలోనూ అన్యాయం జరిగిందని.. పలు రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులివ్వాలని నీతి ఆయోగ్  చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని సీఎం, మంత్రులు, టీఆర్ఎస్​ సీనియర్లు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్ భగీరథకు నిధుల కేటాయింపు రాలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నీటి పారుదల ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేరిట భారీగా రుణాలు తీసుకుంది. పాలమూరు ప్రాజెక్టు కోసం మరో పది వేల కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇక ముందు మరిన్ని అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఆదాయం సమకూర్చుకునే మార్గాల అన్వేషణలో పడిన సర్కారు.. భూముల వేలంపై దృష్టి సారించింది.

బడ్జెట్ కు ముందుగానే..

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ప్రతిపాదనలు అందచేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఇప్పటికే అన్ని శాఖలను ఆదేశించారు. అయితే సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కావాలి. ముఖ్యంగా రుణ మాఫీ, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, మధ్యంతర భృతి, కొత్త సెక్రటేరియెట్, అసెంబ్లీ నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటికి వేల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే భూముల వేలంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

అన్ని జిల్లాల్లో అమ్మకాలు!

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని భూములనే వేలం వేసింది. ఇక ముందు అన్ని జిల్లాల్లోనూ భూముల వేలం చేపట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 7,900 ఎకరాల మేర సర్కారు భూములు ఉన్నట్టు రెవెన్యూ అధికారుల లెక్కలు చెప్తున్నాయి. కొత్త జిల్లాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్​ కు సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లోని ప్రభుత్వ భూములకు ధర ఎక్కువగా వస్తుందని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)’ ఆధ్వర్యంలో విలువైన భూములను గుర్తించే పని మొదలుపెట్టినట్టు సమాచారం. జిల్లాల్లో ఎకరా భూమి రూ.10 కోట్ల వరకు పలుకుతోందని, ఈ మేరకు 200 ఎకరాలను గుర్తించి వేలం ద్వారా రూ.2 వేల కోట్లు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వేలం నిర్వహించినా స్పందన రాని భూములను కూడా ఈసారి వేలంలో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్  కాకుండా మెదక్, కరీంనగర్ జిల్లాల్లో అధికంగా సర్కారీ భూములు ఉన్నాయి. ఆ రెండు జిల్లాల నుంచే రూ.6 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికి నాలుగు సార్లు..

రాష్ట్ర ఆవిర్బావం తర్వాత 2015లో హైదరాబాద్​లోని రాయదుర్గంలోని ప్రభుత్వ భూములను వేలం వేసినప్పుడు రికార్డు స్థాయిలో ఎకరం రూ.29 కోట్ల28 లక్షలు ధర పలికింది. హైదరాబాద్ లో అంత ధర పలకడం అదే తొలిసారి. ఈ ధరకు ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ ఐదెకరాలను కొనుగోలు చేసింది. ఓ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 24 కోట్ల చొప్పున రెండెకరాలు, మరో ఫార్మా కంపెనీ రూ.22 కోట్ల చొప్పున మూడెకరాలను కొన్నది. ఇప్పటివరకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నాలుగు విడతలుగా భూముల విక్రయం చేపట్టారు. మొత్తం 82 ఎకరాల 12 గుంటల భూమిని అమ్మగా.. ప్రభుత్వానికి రూ.1,163 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. తర్వాత పెద్ద నోట్ల రద్దు, నగదు కొరత వంటి పరిణామాలతో భూముల వేలాన్ని నిర్వహించలేదు. తాజాగా మరోసారి వేలం అంశం తెరపైకి వచ్చింది.