ఆన్‌‌లైన్‌‌లో టీచర్ల డేటా సేకరణ తర్వాతే షెడ్యూల్‌‌

ఆన్‌‌లైన్‌‌లో టీచర్ల డేటా సేకరణ తర్వాతే షెడ్యూల్‌‌

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో సర్కారు టీచర్ల బదిలీల అంశం హాట్ టాపిక్‌‌గా మారింది. నాలుగేండ్ల నుంచి బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్న టీచర్లకు సర్కారు మరో షాక్ ఇవ్వనుంది. త్వరలో జరిగే సాధారణ బదిలీల్లో జీవో 317తో ఎఫెక్ట్ అయిన టీచర్లకు అవకాశం ఉండదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం రెండేండ్లు పూర్తయిన వారికే బదిలీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు బడుల్లో 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 2015, 2018లో టీచర్ల బదిలీలు జరిగాయి. ఆ తర్వాత ట్రాన్స్‌‌ఫర్లు జరగలేదు. రెండేండ్ల కింద ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, గతేడాది చివరిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం టీచర్లను జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలకు అలాట్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో జనరల్ ట్రాన్స్‌‌ఫర్లపై దృష్టి పెట్టింది. మరోపక్క టీచర్ యూనియన్ల నేతలు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులను కలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈనెలాఖరు లోపు బదిలీలు, ప్రమోషన్లు ప్రకటించకుంటే వచ్చే నెలలో హైదరాబాద్‌‌లో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో సర్కారు పెద్దలు బదిలీల ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

25 వేల మందికి నో చాన్స్..

సర్కారు రూల్స్ ప్రకారం 8 ఏండ్ల సర్వీస్ పూర్తయినోళ్లు తప్పనిసరిగా స్కూల్ మారాల్సి ఉండగా, రెండేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారూ బదిలీలకు అర్హులు. ఈ రూల్ ఇటీవల జిల్లాలు మారిన టీచర్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. జీవో నంబర్ 317 ప్రకారం 22,572 మంది టీచర్లు, స్పౌజ్ కేటగిరీలో 1,300 మంది , హెడ్‌‌మాస్టర్లు, కోర్టు అప్పీల్స్‌‌తో పాటు మొత్తం జిల్లాలు మారినోళ్లు సుమారు 25 వేల మంది ఉన్నారు. వీరందరికి స్టేషన్ సర్వీస్ మాత్రం ఆ జిల్లాలో రిపోర్టు చేసినప్పటి నుంచే లెక్కగడతారు. దీంతో వారంతా బదిలీలకు అర్హులు కారు. అయితే, దీన్ని కొంతమంది టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. జీవో 317లో అన్ని ఖాళీలు చూపించలేదని, మారుమూల ప్రాంతాల్లోని ఖాళీలే చూపించారని ఆరోపిస్తున్నారు. ముందుకొచ్చే వారందరికీ సాధారణ బదిలీల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, జీవో 317తో ఎఫెక్ట్ కాని మిగిలిన 75 వేల మంది టీచర్లకు బదిలీల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, 50 వేల మంది లోపే టీచర్లు పాల్గొనే చాన్స్‌‌ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరోసారి టీచర్ల వివరాల సేకరణ.. 

టీచర్ల ట్రాన్స్‌‌ఫర్లను ఈసారి ఆన్‌‌లైన్‌‌లో నిర్వహించనున్నట్టు సర్కారు ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆన్‌‌లైన్ విధానానికి అనుగుణంగా టీచర్ల డేటాను మరోసారి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆన్‌‌లైన్‌‌లో టీచర్ల వివరాలను సేకరించేందుకు టీఎస్‌‌ ఆన్‌‌లైన్ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రత్యేకంగా ఓ ఫార్మాట్‌‌ను సిద్ధం చేశారు. టీచర్ ఎప్పుడు అపాయింట్‌‌మెంట్‌‌ అయ్యారు, ఎన్ని సార్లు బదిలీల్లో స్కూళ్లు మారారు, ఎక్కడెక్కడ ఏయే జిల్లాల్లో పని చేశారు, ఎన్నిసార్లు ప్రమోషన్లు పొందారు, శాఖాపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? కోర్టు కేసులేమైనా ఉన్నాయా..? తదితర వివరాలను టీచర్ల నుంచి సేకరించనున్నారు. అయితే, ఈ ఫార్మాట్‌‌ను టీచర్లు ఎలా నింపాలి అనే దానిపై డీఈవోలతో సమావేశం నిర్వహించి, వారికి అవగాహన కల్పించనున్నట్టు సమాచారం. దీనిపై రెండ్రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బదిలీల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు.