సాగు భూములకు ఎక్కువ..ప్లాట్లకు తక్కువ.. విలువ పెంపుపై ప్రభుత్వం కసరత్తు

సాగు భూములకు ఎక్కువ..ప్లాట్లకు తక్కువ.. విలువ పెంపుపై ప్రభుత్వం కసరత్తు
  • వ్యవసాయ భూముల వాల్యూ సవరణతో రైతులకు పెద్దమొత్తంలో లోన్లు వచ్చే చాన్స్
  • స్క్వేర్ ఫీట్ రేట్లను యథాతథంగా ఉంచడంతో పట్టణాల్లో రియల్ ఎస్టేట్​కు ఊపు తెచ్చేలా చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూముల విలువను ప్రభుత్వం పెంచనుంది. అదే సమయంలో ఫ్లాట్లకు సంబంధించిన వాల్యూను తక్కువ మొత్తంలో సవరించనుంది. భూముల విలువ సవరణలో భాగంగా ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. క్షేత్రస్థాయిలో బహిరంగ భూముల రేట్ల వివరాలను సేకరిస్తున్న అధికారులు.. ప్రభుత్వ, మార్కెట్ వాల్యూకు మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వ్యవసాయ భూముల రేట్లు 50 శాతం నుంచి 100 శాతం ఆపైన పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఎకరాకు లక్షన్నర రూపాయాలు ప్రభుత్వ విలువ ఉండగా.. బహిరంగ మార్కెట్​లో రూ.15 లక్షలు పైన రేటు నడుస్తున్నది. దీంతో ఈ ప్రాంతంలో కనీసం రూ.4 లక్షల వరకు మార్కెట్ వాల్యూ పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల విలువను (ఎకరా, స్క్వేర్ యార్డులు) పెద్ద మొత్తంలో పెంచనున్నట్లు తెలుస్తున్నది.

 అయితే అదే సమయంలో ఫ్లాట్ల విలువల సవరణ విషయంలో మాత్రం అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫ్లాట్ల విలువలు (స్వ్కేర్ ఫీట్) చాలా తక్కువగా సవరించేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. తద్వారా మధ్యతరగతి ప్రజలు అపార్ట్‌‌‌‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలుచేసినా రిజిస్ట్రేషన్ ఫీజు భారం ఎక్కువ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్రభుత్వ విలువ పెరిగితే ఆ మేరకు రియల్టర్లు బహిరంగ మార్కెట్‌‌‌‌ ధరను కూడా పెంచితే ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఫ్లాట్ల విలువలను పెద్దగా సవరించలేదు. ఖాళీ స్థలాలను సగటున 40 శాతం నుంచి 50 శాతం పెంచేలా ఏర్పాట్లు చేస్తుండగా, ఫ్లాట్ల విలువను 15 శాతం వరకే సవరించనున్నట్లు తెలుస్తున్నది. పెంచనున్న మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలను జులై ఒకటో తేదీ నుంచి వెబ్ సైట్​లో అందుబాటులో పెట్టనున్నారు. జులై 15 వరకు అభ్యంతరాలు, అభిప్రాయాలు తీసుకుంటారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంచిన మార్కెట్ వాల్యూ అమల్లోకి రానుంది.

అగ్రికల్చర్ వాల్యూ పెరిగితే మరింత రియల్ భూమ్​

వ్యవసాయేతర వినియోగానికి అనువుగా..  ప్లాట్లు, ఇండ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్‌‌‌‌లు, వినోద సౌకర్యాలు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలలోని భూముల విలువను అధికంగా పెంచనున్నారు. వాస్తవంగా బహిరంగ రేట్లకు.. ప్రభుత్వ రేటుకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. వ్యవసాయ భూముల విలువ ఎక్కువగా పెరిగితే.. రైతులకు కలిసి వస్తుందని అంటున్నారు. మరింత రియల్ భూమ్ రావడంతో పాటు బ్యాంకుల్లో లోన్లు తీసుకునే రైతులకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మొత్తంలో రుణాలు లభిస్తాయని అంటున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ఆధారంగా మార్టిగేజ్, పంట రుణాలను ప్రతి ఏటా పెంచుతుంటారు. ఇక  మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు, నూతన వార్డులు, కమర్షియల్‌‌‌‌గా మారిన ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్‌‌‌‌లో మంచి ధర పలుకుతున్నది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌‌‌‌ ధర ఆధారంగా.. ప్రభుత్వ విలువను ఇంకింత పెంచుకోవాలని  భావిస్తున్నది. ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను ప్రతిపాదించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూముల విలువలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడం, మారుమూల గ్రామాల్లో కూడా ఎకరా కనిష్టంగా రూ.15 లక్షల వరకు బహిరంగ మార్కెట్‌‌‌‌లో ధర పలుకుతుండడంతో మరోమారు భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజినల్‌‌‌‌ రింగు రోడ్డు లాంటి అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల భూముల విలువలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో వాల్యూ సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నది.