ఎన్‌‌సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం కరెక్టే.. పోలీసు ఉద్యోగాల భర్తీ కేసులో హైకోర్టు తీర్పు

ఎన్‌‌సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం కరెక్టే.. పోలీసు ఉద్యోగాల భర్తీ కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు :  పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్‌‌సీసీ కోటాను సమానంగా పరిగణించాలనే ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. జీవో 14ను సవాల్‌‌ చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. స్టైపెండరీ క్యాడెట్‌‌ ట్రైనీ, ఎస్సై, అగ్నిమాపక శాఖ, డిప్యూటీ జైలర్‌‌ తదితర పోస్టుల నియమాక ప్రక్రియలో ఎన్‌‌సీసీ కోటాను ఏ, బీ, సీ సర్టిఫికెట్ల వారీగా కాకుండా అన్ని సర్టిఫికెట్లను సమానంగా పరిగణించేలా జీవో 14ను ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం 3 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమర్థనీయమేనని కోర్టు చెప్పింది. పిటిషనర్లు ప్రాథమిక, శారీరక దారుఢ్య పరీక్షల్లో విఫలమైనట్లు తెలుసుకున్నాకే నియామక నోటిఫికేషన్‌‌ను సవాల్‌‌ చేశారని తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌ తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల తీర్పు చెప్పింది. నియామక నోటిఫికేషన్‌‌లోనే ఏ, బీ, సీ సర్టిఫికెట్లను సమానంగా పరిగణిస్తామని ఉందని చెప్పింది. ఏ కంటే బీ, బీ కంటే సీ క్యాటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోం శాఖ జారీ చేసిన సర్క్యులర్‌‌ కేవలం సూచన మాత్రమేనని తెలిపింది. సర్టిఫికెట్‌‌ ఉన్నవారి అర్హతను నిర్ణయించే అధికారం పోలీస్‌‌ నియామక మండలి పరిధిలోనే ఉందని తేల్చి చెప్పింది. 2015లో వెలువడిన నోటిఫికేషన్‌‌లో అమలు చేయలేదని పిటిషనర్లు చెప్పడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. చట్ట ప్రకారం ఎన్‌‌సీసీకి 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని విస్మరించకూడదని తెలిపింది.

దుర్గం చెరువు కాలుష్యంపై ఆగ్రహం

హైదరాబాద్‌‌లోని దుర్గం చెరువులోకి వ్యర్థాలు చేరి కాలుష్యం కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తే.. ‘‘అబ్బే.. అదేం లేదు”అని రిపోర్టు ఇచ్చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆఫీసర్లపై ఆధారపడకుండా తామే ఒక ప్రత్యేక కమిటీని వేస్తామని చెప్పింది. ప్రత్యేక కమిటీని సిఫార్సు చేయాలని అమికస్‌‌క్యూరీ, సీనియర్‌‌ అడ్వొకేట్‌‌ వేదుల శ్రీనివాస్‌‌ను ఆదేశించింది. స్పెషల్​ కమిటీలో సీనియర్‌‌ అడ్వొకేట్, ఒక ఎన్‌‌జీవో, ఎవరి ఒత్తిళ్లకు లొంగని ఆఫీసర్లు ఉండాలని చెప్పింది. దుర్గం చెరువు దుస్థితిపై ఒక ఇంగ్లిష్​ దినపత్రికలో స్టోరీ పబ్లిష్​అయింది. చెరువులోకి రసాయనాలు, ఔషధ ఫ్యాక్టరీల వ్యర్థాలు, ప్లాస్టిక్, మురుగు నీరు చేరడంతో కాలుష్యం తీవ్రంగా ఉందని, చేపలు చచ్చిపోయి తేలియాడుతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ స్టోరీని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ శనివారం దీనిని విచారించింది. అయితే, గడువు ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని ప్రభుత్వ అడ్వొకేట్​ చెప్పడంతో బెంచ్​ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. రాత్రికి రాత్రే నివేదిక ఇచ్చేయగల అధికారులు ఉన్నారని, ఆక్రమణలు లేవని, కాలుష్యమే లేదని తేల్చి చెప్పగలరని వ్యాఖ్యానించింది. నీటి వనరులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అధికారులను వెనకేసుకు రావొద్దని హితవు పలికింది. చెరువు కాలుష్యం, ఆక్రమణలపై తాము ప్రభుత్వ అధికారుల నివేదికపై ఆధారపడబోమని, ఏ తరహా ఒత్తిళ్లకు లొంగని వారితో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.