నల్గొండ/నకిరేకల్/నాగర్ కర్నూల్ టౌన్/ఆమనగల్లు/గద్వాల/నారాయణపేట/వనపర్తి/ జిన్నారం, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.
బుధవారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించిన విద్యా అవగాహన సదస్సులలో వారు మాట్లాడారు. బడ్జెట్‌లో విద్యకు 8 శాతం నిధులు కేటాయించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల కోట్లతో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్పొరేటర్లు కనీసం నెలకు ఒకసారైనా పాఠశాలలను సందర్శించి మౌలిక వసతులు, విద్యాబోధన, విద్యార్థుల హాజరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల మాయలో పడి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న డిజిటల్ విద్య, మెరుగైన వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, రిజ్వాన్ భాషా షేక్, సీహెచ్ ప్రియాంక, చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కసిరెడ్డి నారాయణరెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొని విద్యా రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు.
