తరతరాలకు స్ఫూర్తిదాత తులసీదాస్

తరతరాలకు స్ఫూర్తిదాత తులసీదాస్

తులసీదాస్ గొప్ప కవి. మతోద్ధారకుడు. ఆయన తన సొంత బోధనా విధానాన్ని నెలకొల్పి తన శిష్యులకు ‘‘విముక్తులు” అని ప్రఖ్యాత నామం ఇచ్చి, అన్ని కులాల వాళ్లను చేర్చుకుంటూ జనాలకు వాళ్లవాళ్ల సొంత భాషలోనే బోధించేవాడు. తులసీదాస్ ప్రజల కవి. ఆయన స్వభాషలో అసాధారణ ప్రతిభతో తన ఊహాశక్తిని వివిధ వ్యూహాలతో, విభిన్న వర్ణనలతో, ప్రకృతి నుంచి గ్రహించిన వాటితో కవిత్వ అలంకారాలతో హృద్యంగా రాసేవాడు.

అయితే అది సామాన్యులకు అర్థమయ్యేలా సరళంగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అనుభవజ్ఞుడు. ఆయనకు భాషలో ఎంత ప్రావీణ్యం ఉన్నప్పటికీ ఎప్పుడూ గర్వించలేదు. గొప్ప వ్యక్తులతో పరిచయాలున్నప్పటికీ సాదాసీదా జీవితాన్నే గడిపేవాడు. ప్రజలతో మమేకమై స్వేచ్ఛగా తిరుగేవాడు. ఆయన అనుభవజ్ఞానాన్నంతా తన రచనల్లో చూపించాడు. ఆయన భావనలు స్థిరంగా, ఉన్నతంగా, ఆకర్షణీయంగా ఉండేవి. తరతరాలుగా జనాలు కూడా ఆయనను తమ మార్గదర్శిగా చెప్పుకుంటున్నారు.  

తులసీదాస్​1532లో జన్మించాడు. ఆయన జన్మస్థలం ఉత్తరప్రదేశ్​లోని సరోన్​ అని 2012లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గంగా నది ఒడ్డున ఉండే ప్రదేశం సరోన్​. ఆయన పుట్టిన ఘడియలు మంచివి కాకపోవడం వల్ల ఆయన ఒంటరి వాడయ్యాడు. అందుకు కారణం వాళ్ల సంప్రదాయంలో చెడు ఘడియల్లో పుట్టిన బిడ్డల్ని తల్లిదండ్రులు దూరంగా విడిచిపెడతారు. ఆయనకూ అలాగే జరిగిందంటాడు తులసీదాస్. అలాంటప్పుడు ఒక సాధువు అతన్ని తన శిష్యునిగా వెంటబెట్టుకుని దేశమంతా తిరిగాడు.

తులసీదాస్​ విద్య నేర్చుకుంటూ రాముని గురించి తెలుసుకుంటూ గడిపాడు. ఆ తర్వాత ఆ గాథనే రాశాడు. ఆయన జన్మతః బ్రాహ్మణడు. ఆయనకు తన తల్లిదండ్రుల పేర్లు కూడా తెలియవు. ఆయన రత్నావళిని పెండ్లి చేసుకున్నాడు. ఆమె తన పుట్టింట్లో నిత్యం రాముని ఆరాధిస్తూ ఎంతో పవిత్రంగా పెరిగింది. వీళ్లకు ఒక కొడుకు పుట్టాడు. కానీ, చిన్న వయసులోనే మరణించాడు. ఆ తర్వాత భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందట.

తులసీదాస్​ ఆమెను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినా ఫలించలేదు. అందుకు బదులుగా ఆమె తులసీదాస్​​ జీవితాన్ని శ్రీరాముని ఆరాధనకు అంకితం చేయాలని కోరింది. అంతటితో తులసీదాస్​ తన ఇంటిని విడిచిపెట్టి సన్యాసిగా, సంచార వైష్ణవుడిగా మారాడు. అవధ్​ నగరంలో నివసిస్తూ 43వ ఏట రామాయణ కావ్యం రచించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తోటి భక్తులతో భేదాభిప్రాయం రావడంతో అవధ్​ నుంచి వారణాసికి వెళ్లాడు. తన రచన, బోధనను అక్కడే కొనసాగించాడు. వృద్ధాప్యంలో ప్లేగు వ్యాధి సోకింది. కొంతకాలానికి దాన్నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత1623లో మరణించారు. 

రామాయణాన్ని మాతృభాషలో రాయడానికే ప్రాధాన్యమిచ్చాడు. సంస్కృతంలో మహా పండితులై ఉండి మామూలు భాషలో రాయడమేంటని అడిగితే, ఆయన చెప్పిన సమాధానాలు రకరకాలుగా ప్రచారంలో ఉన్నాయి. తులసీదాస్​ ఒక స్పష్టమైన దృక్పథం కలవాడు. ఒక కవిగా ఆయన తన సొంత వ్యాఖ్యానాలతో హిందూ మతాన్ని అమరం చేశాడు. ఆయన రచనల్లో రామచరిత్​మానస్ కాకుండా దోహావళి, సాహిత్య రత్న, గీతావళి, కృష్ణావళి, వినయపత్రిక వంటివి ఉన్నాయి. ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకం. ఇవికాక బార్వై రామాయణ్, పార్వతి మంగళ్, జానకి మంగళ్ వంటివి ఎన్నో ఉన్నాయి.

 - మేకల మదన్​మోహన్​ రావుకవి, రచయిత