ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా యాప్స్ బ్యాన్

ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా యాప్స్ బ్యాన్

ఖాట్మండు: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్స్‎కు నేపాల్ గవర్నమెంట్ బిగ్ షాకిచ్చింది. ఫేస్‌బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా యాప్స్‎తో సహా 26 యాప్‎లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (సెప్టెంబర్ 4) వెల్లడించింది. 

నేపాల్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ మాట్లాడుతూ.. ప్రజలు విస్తృతంగా ఉపయోగించే ఇన్స్‎స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్స్‎ను ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడంతో ఆ యాప్స్‎పై నిషేధం విధించినట్లు క్లారిటీ ఇచ్చారు. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కంపెనీలను పదే పదే హెచ్చరించిన.. గైడ్ లైన్స్ పాటించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని తెలిపారు. దీంతో ఆ కంపెనీలపై నిషేధం విధించినట్లు వివరణ ఇచ్చారు. అయితే.. టిక్‌టాక్, వైబర్‌తో సహా ఐదు ప్లాట్‌ఫారమ్‌లు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని.. వాటిపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు. 

నేపాల్‎లో పని చేసే దేశ, విదేశీ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్‎లకు స్థానిక అనుసంధానకర్త లేదా సంప్రదింపు వ్యక్తిని నియమించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని.. బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ఉన్నాయని నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం 2025, సెప్టెంబర్ 3వ తేదీ డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. 

ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు నేపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. నేపాల్‎లో పని చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు -తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన (సెప్టెంబర్ 3) గడువులోగా ఇన్స్‎స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి. 

దీంతో 2025, సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ చేసుకోని 26 ప్రధాని సోషల్ మీడియా యాప్‎లపై ప్రభుత్వం  కొరడా ఝలిపించింది. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటులో ఇంకా చర్చ కూడా పూర్తి కాని ఈ బిల్లుపై ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. ప్రత్యర్థులను నోరు మూయించడానికి, భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టడానికేనని మండిపడుతున్నాయి.