
దేశంలోనే ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 5న ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. గణపతికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు . ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్..సీఎం హోదాలో పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశ్ ఇపుడు ఈ స్థాయికి చేరుకుందన్నారు. 71 సంవత్సరాలుగా ఖైరతాబాద్ వినాయకుడికి ఘనంగా పూజలు జరుగుతున్నాయని చెప్పారు. నగరంలో ఎన్ని విగ్రహాలున్నా ఈ మహాగణపతికి పోటీలేదు..సరిరారు అని అన్నారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ముందుకెళ్తోందన్నారు రేవంత్. గణేశ్ భక్తుల మనోభావాలు గౌరవించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే ఘనంగా పూజలు జరుగుతాయన్నారు. నగరంలో లక్షా 40 వేల విగ్రహాలను ప్రతిష్టించారని చెప్పారు. ఎక్కడా లేని విధంగా గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు రేవంత్.
సెప్టెంబర్ 6న ఉదయం 6గంటలకు ఖైరతాబాద్ మహా గణేశు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాగణపతి శోభాయాత్రను చేసేందుకు భక్తులు భారీగా తరలిరానుండంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మద్యాహ్నం ఒంటి గంటలోపు మహాగణపతి నిమజ్జనాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మహాగణపతి ట్యాంక్ బండ్ లోని క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం చేయనున్నారు.