
శ్రీశైలం డ్యామ్ రెండు గేట్లు లీక్ అయ్యాయి. 3, 10వ నంబర్ క్రస్ట్ గేట్లు లీక్ కావడంతో ప్రాజెక్ట్ నుంచి దిగువకు వరద నీరు వృధాగా పోతుంది. వర్షాకాలం దృష్ట్యా డ్యామ్ గేట్లకు రబ్బరు సీళ్లు అమర్చడం, మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. జలాశయానికి వరదనీరు ప్రారంభం కాకముందే డ్యామ్ గేట్లు లీకేజీ కావడంతో.. రెండు నెలల క్రితమే ఇంజనీర్లు డ్యామ్ మరమ్మత్తు పనులు చేపట్టారు. గేట్ల లీకేజీలు అరికట్టేందుకు పాత రబ్బర్ సీళ్లు తొలగించి తూతూ మంత్రంగా కొత్త రబ్బరు సీళ్లు అమర్చారు.
ఇంజనీర్ల పర్యవేక్షణ కొరవడటంతో రెండు నెలలు కూడా గడవక ముందే శ్రీశైలం ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు మళ్లీ లీకేజీ అవుతున్నాయి. 3, 10 నెంబర్ గేట్లు నుంచి వాటర్ లీక్ అవుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి భారీగా నీరు వృధాగా పోతుంది. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ సొమ్ము వరద నీటిలాగే వృధాగా పోతుంది. రెండు నెలలు గడవకముందే గేట్లు మళ్లీ కావడంతో ఇంజనీర్లపై పై అధికారులు సీరియస్ అయ్యారు.
లీకేజీలు అరికట్టకపోతే డ్యామ్ ఉనికికే ప్రమాదమని.. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇంజినీర్ల పర్యవేక్షణ లోపంతో ఇటీవల తుంగభద్ర డ్యామ్ గేట్ వరదనీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్ లీకేజీలపై అధికారులు దృష్టి సారించకపోతే శ్రీశైలం డ్యామ్ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది.