LokahChapter1 Box Office: వారం రోజులైన కుమ్మేస్తున్న మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ సూపర్ హిట్

LokahChapter1 Box Office: వారం రోజులైన కుమ్మేస్తున్న మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ సూపర్ హిట్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’.  డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో  సూపర్ హీరోయిన్‌‌గా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. నస్లేన్ కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదలైంది. తెలుగులో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ మూవీ మొదటివారంలోనే రూ. వంద కోట్ల గ్రాస్ రాబట్టి విజయం సాధించిందని టీమ్ చెబుతోంది. 

కొత్త లోక బాక్సాఫీస్ వసూళ్లు:

Sacnilk.com ప్రకారం.. ఈ మూవీ రిలీజైన మొదటివారంలోనే రూ. వంద కోట్ల గ్రాస్ రాబట్టి కొనసాగుతుంది. ఇండియా వైడ్ గా రూ.55.59 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి రికార్డులు నెలకొల్పే పనిలో పడింది. ఇండియా కంటే విదేశాల్లో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

కేవలం మలయాళం వెర్షన్ లోనే ఇప్పటి వరకూ రూ.42.72 కోట్లు వచ్చాయి. రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత తెలుగులో రూ.7.13 కోట్లు అధికంగా కలెక్ట్ చేసింది. మోహన్‌లాల్ నటించిన హృదయపూర్వం సినిమాను కూడా ఈ మూవీ వెనక్కి నెట్టేసింది. ఈ క్రమంలో సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో నిర్వహించిన  సక్సెస్ మీట్‌‌లో దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి అతిథులుగా హాజరై సినిమా తాము చూశామని చాలా నచ్చిందని టీమ్‌‌ను అభినందించారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘మా బ్యానర్‌‌‌‌లో ఇప్పటివరకు ఏడు సినిమాలు నిర్మించాం. ఈ మూవీ కోసం బెస్ట్ టీమ్‌‌తో వర్క్ చేశాం. నిర్మాతగా వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్‌‌కి మహా అయితే ఒక్కసారి వెళ్ళి ఉంటాను. అంతలా టీంని నమ్మాను. వారు కూడా తమ డ్రీమ్‌‌లా ఈ సినిమా కోసం పని చేశారు.

ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని చెప్పాడు. ఈ సినిమాపై తెలుగు ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమే తమకు బలమని కళ్యాణ్ ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్  చెప్పారు.  ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని దర్శకుడు డొమినిక్ అరుణ్ అన్నాడు. ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉందని  నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు.