Akhanda 2: ' అఖండ 2' వాయిదా అసలు కారణం ఇదేనా? బాలయ్య క్లారిటీతో ఫ్యాన్స్ లో కొత్త ఆశలు!

Akhanda 2:  ' అఖండ 2' వాయిదా అసలు కారణం ఇదేనా? బాలయ్య క్లారిటీతో ఫ్యాన్స్ లో కొత్త ఆశలు!

నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం  'అఖండ 2: తాండవం'.  ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయి చేరాయి.  సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ మూవీ ఊహించని పరిణామాలతో వాయిదా పడింది. ఈ వార్త  అభిమానులను  తీవ్ర నిరాశకు గురిచేసింది. అసలు 'అఖండ 2' రిలీజ్ ఆలస్యానికి గల కారణం ఏమిటని  సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.  వీటన్నింటికి చెక్ పెడుతూ బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

తన సొంత గ్రామం నిమ్మకూరులో పర్యటించిన బాలకృష్ణ 'అఖండ2' సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.  సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా సంగీతంపై మరింత సమయం కావాలి కోరినట్లు తెలిపారు. 'అఖండ' సినిమా విడుదల సమయంలో సౌండ్ వూఫర్లు బద్దలయ్యాయి. కానీ 'అఖండ 2' డిసెంబర్‌లో దానికంటే 50 రెట్లు పెద్దగా ఉంటుంది. త్వరలో కచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తాము అని బాలకృష్ణ వెల్లడించారు. అభిమానుల అంచనాలకు మించి ఈ సారి 'అఖండ2 ' ఉంటుందన్నారు. బాక్సాఫీస్ లో చరిత్ర సృష్టించబోతున్నామంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహన్ని నింపారు.

'అఖండ 2' విడుదల ఆలస్యానికి గల కారణంపై బాలకృష్ణ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి.  ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. 'అఖండ'లో తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా విజయానికి ఎంతగానో దోహదపడింది. ఈసారి అంతకు మించి అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి తమన్ కృషి చేస్తున్నారని బాలయ్య స్పష్టం చేశారు.

ఈ ఆలస్యం వల్ల సినిమాకు పోస్ట్-ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం లభించింది. అంతే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG'తో నేరుగా బాక్సాఫీస్ పోరు కూడా లేకుండా పోయింది.  ఇది కూడా 'అఖండ 2' సినిమాకు కలిసొచ్చే అంశంగా చిత్ర బృందం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం డిసెంబర్ 5న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' సినిమా జనవరి 2026కి వాయిదా పడటంతో, డిసెంబర్ నెల 'అఖండ 2'కు ఏకఛత్రాధిపత్యం లభించే అవకాశం ఉంది.

దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలకృష్ణకు ఇది నాలుగో సినిమా. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అఖండ 2: తాండవం'లో బాలకృష్ణ పోషించే అఘోరా పాత్ర మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని చెబుతున్నారు. ఈసారి సినిమా మరింత భారీ స్థాయిలో, హిమాలయాల నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతోంది. విలన్‌గా ఆది పినిశెట్టి నటిస్తుండగా, హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. వీరితో పాటు ప్రగ్యా జైస్వాల్, హర్షాలీ మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గత రికార్డులను బద్దలు కొట్టేలా ఉంటుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. డిసెంబర్‌లో 'అఖండ 2' బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో సునామీ సృష్టిస్తుందో చూడాలి.