తెలుగు సాహిత్య రంగంలో 1960, 70 దశకాలలో రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) సృష్టించిన అలజడి మామూలుది కాదు. ఆయన సాహిత్య విమర్శ అనే విభాగాన్ని ఎంచుకొని మొత్తం సాహిత్య రంగం గురించి కొత్త ఆలోచనలు చేశాడు. ఆయనకుముందు కూడా విమర్శను ఒక సామాజిక బాధ్యతగా భావించిన విమర్శకులున్నారు. కానీ ఆయనలా సాహిత్య విమర్శను ఒక యుద్ధంలా భావించి పోరాటం చేసిన వాళ్లెవరూ లేరు.
సామాజిక శాస్త్రాలతో సాహిత్యానికి గల సంబంధాల నేపథ్యంలో విమర్శను అభివృద్ధి చేసిన విమర్శకుడు రారా. అందుకే విమర్శనారంగంలో ‘రారా’ మార్గం ఒకటి ఏర్పడింది. ఆయన విమర్శను తట్టుకోలేక కొందరు రాచమల్లును కాస్తా ‘రాచముల్లు’గా పిలుచుకున్నారంటేనే ఆయన తీవ్రత ఏమిటో అర్థం అవుతుంది. ఎవరు బాధపడినా, నొచ్చుకున్నా ఆయన చెప్పదల్చుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ఇప్పుడలా చెప్పేవారూ లేరు, చెప్తే వినేవాళ్లూ లేరు.
సాహిత్యం ఏ వర్గాల కోసం పనిచేస్తున్నదన్న సత్యాన్ని దాని స్వభావం వెల్లడి చేస్తుంది. సాహిత్య స్వభావం సామాన్యంగా దానంతట అదే వెల్లడి కాదు.అందరూ కనిపెట్టలేరని కాదుకానీ దాని స్వభావాన్ని సమర్థవంతంగా పట్టుకునేది మాత్రం సాహిత్య విమర్శకుడే. విమర్శకులందరికీ ఈ పని చేతనవుతుందని చెప్పటం ఒక అబద్ధం. విమర్శకుల మెదడులో సరియైన సామాజిక దృక్పథం లేకపోతే విమర్శ ఉత్త ప్రశంసగా మాత్రమే మిగిలిపోతుంది. విమర్శకుల పేరుతో తెలుగు సాహిత్యంలో ఏది రాసినా ఆకాశానికి ఎత్తేవారు మనకు కోకొల్లలు. వాళ్లకి సరైన ప్రాపంచిక దృక్పథం లేకపోవటమే ప్రధానలోపం. ఈపాటి విమర్శకులు మనకు మొదటినుంచీ ఉన్నారు. ఇటువంటి వాళ్ల మీద ధ్వజమెత్తాడు రారా. వాళ్లు సాహిత్య రంగాన్ని కలుషితం చేస్తున్నారని చెప్తూ వాళ్లను ఒక రకంగా శత్రుపూరిత దృక్పథంతోనే చూశాడు. ‘ఎవరికీ సాహసం లేనప్పుడు రాజకీయరంగంలో లాగే సాహిత్యరంగంలో కూడా నోరున్నవారిదే రాజ్యం’ అంటాడు రారా.
అలాగే ‘సాహిత్యం ద్వారా సమాజ శ్రేయస్సులాంటిదేదో సాధించవచ్చుననే విశ్వాసం బలంగా ఉన్నవాళ్లే సాహసం చేయగలరు’ అనికూడా అంటాడు. ఈ రెండు వ్యాఖ్యలు చాలు రారా సాహిత్య విమర్శకు గల లక్ష్యాన్ని అర్థం చేసుకోవటానికి. గమనమూ, గమ్యమూ స్పష్టంగా తెలిసి తెలుగు విమర్శా రంగాన్ని పరిపుష్టం చేసినవాడు రారా. రారా సాహిత్యవిమర్శను ఎంతో బాధ్యతతో చేపట్టాడు. ఈ విషయం ఆయన చేసిన విమర్శను గమనిస్తే తెలుస్తుంది. దీనికోసం ఆయన పెద్దవాళ్లను కూడా విడిచిపెట్టలేదు. పోనీలే మనవాడే కదా అని మెత్తబడలేదు. నిష్కర్షగా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పాడు. ఆ చెప్పేది ఘాటుగా, తీవ్రతతో చెప్పాడు. ఆయన చేత మొట్టికాయలు వేయించుకున్న వాళ్లు కూడా పొగడగలిగే స్థాయిలో రాసిన విమర్శ రారాది. దానికి కారణం ముగ్ధమనోహరమైన ఆయన శైలి. తెలుగువారి దురదృష్టం ఏమిటంటే ఆయనలాంటి స్పష్టత, పదునైన వ్యక్తీకరణ ఆనాడే కాదు నేటికీ మరొకరిలో కనిపించదు.
ఆయన కేవలం సాహిత్య విమర్శ కోసమే ఒక త్రైమాసిక పత్రికను నడిపాడు. దానిపేరు ‘సంవేదన’. ఆయన తనకాలంనాటి సాహిత్యంలోని అపసవ్య ధోరణుల పట్ల పడిన వేదననే ఈ ‘సంవేదన’ అనిచెప్పటం అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఈ ‘సంవేదన’ ఏడు సంచికలు మాత్రమే వచ్చింది. కానీ తెలుగు సాహిత్య రంగంలో ఒక అలజడిని సృష్టించింది. దానిలో ఆయన రాసిన సంపాదకీయ వ్యాసాలు, సమీక్షలు, విమర్శనా వ్యాసాలు -తెలుగు సాహిత్య విమర్శకు కొత్త దారిని చూపాయి.
మొహమాటం లేనితనం, మాటకారితనం, నిజాయితీ, పదునైన వ్యక్తీకరణ, సాహిత్యంపట్ల వల్లమాలిన ప్రేమ ఆయన విమర్శలో కనిపించే సుగుణాలు. ఆయన కొన్నిసార్లు ఎంత తీవ్రంగా చెప్పేవాడంటే, ఆ తీవ్రతను చూసి కొందరు రారా మమ్మల్ని తిడుతున్నాడని భ్రమపడే వాళ్లు. కొందరైతే రారా చేత తిట్లు తిన్నామని గర్వంగా చెప్పుకునేవాళ్లు. ‘మతపిచ్చి కుక్క కరిచిన రచయిత’, ‘సమాజం అంతగా పతనమైందా?’ అలాంటి వ్యాసాలే.
సాహిత్య విమర్శకు సంబంధించి రారా నుంచి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నిజాన్ని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పటం ఆయనలో అడుగడుగునా గమనిస్తాం. దానికోసం ఎవరు నొచ్చుకున్నా ఆయన పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే సాహిత్యం ద్వారా ఆయన సామాజిక చైతన్యాన్ని ఆశించాడు. విమర్శ ద్వారా సాహిత్య చైతన్యాన్ని కలగన్నాడు.
గురజాడ, చలం, కొకు గురించి ఆయన చేసిన విమర్శలు ఒక సాహితీవేత్తను అనేక కోణాల నుంచి ఎలా చూడాలో తదనంతర తెలుగు సాహిత్య విమర్శకులకు పాఠాలు చెప్పాయి. ‘మహానుభావుడు చలం’ అనే వ్యాసంలో ‘చలం మన సాహిత్యంలో తెచ్చిన విప్లవం మరవరానిది, మాసిపోనిది’ అన్నట్టుగానే రారా తెలుగు సాహిత్య విమర్శలో తెచ్చిన విప్లవం మరవరానిది, మాసిపోనిది.
తోకల రాజేశం
- లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com

