శాండ్ విచ్ బిజినెస్ తో 17 ఏండ్ల కుర్రాడి రికార్డు

శాండ్ విచ్ బిజినెస్ తో 17 ఏండ్ల కుర్రాడి రికార్డు

బర్గర్లు, శాండ్‌‌విచ్‌‌లు తింటే బరువు పెరుగుతారు అని బలంగా నమ్మేరోజుల్లో వాటితో కూడా బరువు తగ్గొచ్చు అని ప్రూవ్ చేసిన బ్రాండ్ సబ్‌‌వే. సబ్‌‌వే అంటే హెల్దీ అన్న ఫీలింగ్ ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే ఆ బ్రాండ్ ఇమేజ్‌‌ను సాధించడం కోసం ఆ సంస్థ ఫౌండర్లు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఫ్రెడ్ డెలుకా అనే పదిహేడేండ్ల కుర్రాడు మొదలుపెట్టిన చిన్న శాండ్‌‌విచ్ బిజినెస్.. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫుడ్ చెయిన్‌‌గా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ఇది చదవాలి. 

ఫ్రెడ్ డెలుకా న్యూయార్క్‌‌లోని బ్రూక్లిన్‌‌లో పుట్టాడు. వాళ్లది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.  తండ్రి ఫ్యాక్టరీలో వర్కర్‌‌‌‌గా పనిచేసేవాడు. కొన్నేండ్ల తర్వాత ఫ్రెడ్ వాళ్ల ఫ్యామిలీ బ్రిడ్జ్‌‌పోర్ట్‌‌కు షిఫ్ట్ అయింది. ఫ్రెడ్ అక్కడే సెంట్రల్ హైస్కూల్‌‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఫ్రెడ్‌‌కు బ్రిడ్జ్‌‌పోర్ట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవాలని ఉండేది. ఇంట్లో చదివించే స్థోమత లేకపోవడంతో తానే సొంతంగా సంపాదించి చదువుకోవాలనుకున్నాడు. దానికోసం ఒక హార్డ్‌‌వేర్ స్టోర్‌‌‌‌లో వర్కర్‌‌‌‌గా జాయిన్ అయ్యాడు. కానీ, అక్కడ ఇచ్చే జీతం కాలేజీ ఫీజులకు సరిపోదని ఫ్రెడ్‌‌కు అర్థమైంది. డబ్బు కోసం ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఐడియా వచ్చింది.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గా మొదలై..

ఫ్రెడ్ మెడిసిన్ పూర్తి చేయడానికి డబ్బు కావాలి. కానీ, 17 ఏండ్ల ఫ్రెడ్‌‌కు బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. అందుకే చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకున్నాడు. శాండ్‌‌విచ్, కోక్ డ్రింక్.. ఈ రెండింటిని తక్కువ ధరకు అమ్మితే చాలనుకున్నాడు. తక్కువ ధరకి హెల్దీ శాండ్‌‌విచ్‌‌లు అమ్మితే కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మాడు. అయితే తన శాండ్‌‌విచ్ బిజినెస్‌‌ పెట్టడానికి ఫ్రెడ్ దగ్గర పెట్టుబడి లేదు. దాంతో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పీటర్ బక్ నుంచి వెయ్యి డాలర్లు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బుతో బ్రిడ్జ్ పోర్ట్‌‌లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశాడు. పీటర్ సాయానికి గుర్తుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌‌‌‌కు ‘పీట్స్ సూపర్ సబ్‌‌మెరిన్స్’ అని పేరు పెట్టాడు. సబ్‌‌మెరిన్ అంటే పొడవాటి శాండ్‌‌విచ్ అని అర్థం. అప్పట్లో అదొక కొత్తరకం శాండ్‌‌విచ్.

ఫ్రెడ్ తన కొత్త స్టోర్ గురించి రేడియోలో కూడా యాడ్​ ఇచ్చాడు. దాంతో మొదటి రోజు 312 శాండ్‌‌విచ్‌‌లు అమ్ముడయ్యాయి. ఒక్కో శాండ్ విచ్ ధర 50 సెంట్లు. ఆ స్టోర్‌‌‌‌లో కూరగాయలతో చేసిన వెజ్ శాండ్‌‌విచ్, కోక్ డ్రింక్ మాత్రమే దొరికేవి. ఫ్రెడ్ అనుకున్నట్టుగానే సింపుల్ శాండ్‌‌విచ్ స్టోర్‌‌‌‌గా ‘పీట్స్ సబ్‌‌మెరిన్స్‌‌’ పేరు బాగానే పాపులర్ అయింది.  కానీ, అనుకున్న లాభాలు మాత్రం రాలేదు. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి లాభాలు రాకపోగా ఫ్రెడ్  చేతిలో ఆరు డాలర్లు మాత్రమే మిగిలాయి. అలా ఫ్రెడ్ మొదటి అటెంప్ట్ ఫెయిల్ అయింది. 

పేరు మార్చి..

తన బిజినెస్ సక్సెస్ కానందుకు ఫ్రెడ్ బాధపడలేదు. మరో స్టోర్ పెట్టి ఇంకా తక్కువ ధరలో హెల్దీ శాండ్ విచ్‌‌లు అందిస్తే కచ్చితంగా కస్టమర్లు పెరుగుతారు అనుకున్నాడు.  పీటర్  సాయంతో అదే వీధిలో మరొక స్టోర్ తెరిచాడు. కానీ, ఈసారి కూడా లాభాలు రాలేదు. అయినా వెనక్కి తగ్గకుండా మూడో ప్రయత్నంగా మరొక స్టోర్ ఓపెన్ చేద్దామనుకున్నారు ఫ్రెడ్, పీటర్‌‌‌‌. ఈసారి పేరు మార్చి ‘సబ్‌‌వే’  అని పెట్టారు. ఆ పేరు వల్లనో ఏమో గానీ మూడో సారి మాత్రం సబ్‌‌వేకు లాభాల పంట పండింది. ఏడాది కాలంలో ఏడువేల డాలర్ల ప్రాఫిట్ వచ్చింది. శాండ్‌‌విచ్ బిజినెస్ సక్సెస్ అవ్వడంతో ఫ్రెడ్ తన కెరీర్‌‌‌‌ను ఫుడ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ చేద్దామనుకున్నాడు. ఎలాగైనా 30 సబ్‌‌వే స్టోర్లు ఓపెన్ చేయాలని ఫ్రెడ్, పీటర్‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పదేండ్ల పాటు కష్టపడి కేవలం 16 స్టోర్లు మాత్రమే పెట్టగలిగారు. ప్రతీ స్టోర్‌‌‌‌లో ఒకేరకమైన రుచి, క్వాలిటీని మెయింటెయిన్ చేయడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది వాళ్లకి. అప్పుడే ఫ్రెడ్‌‌కు ఫ్రాంచైజీ ఆలోచన వచ్చింది. తన ఫ్రెండ్ బ్రియాన్‌‌ను ఒప్పించి మరీ మొదటి సబ్‌‌వే ఫ్రాంఛైజీని ఏర్పాటు చేయించాడు. తక్కువ ధరకే ఫ్రాంచైజీ ఇస్తామని ప్రకటనలు ఇచ్చాడు. దాంతో ఆ ఏడాదిలో 14 సబ్‌‌వే ఫ్రాంచైజీలు పుట్టుకొచ్చాయి.  

మెనూ మార్చి..

సబ్‌‌వే రెస్టారెంట్లు పాపులర్ అవుతున్న టైంలో మెనూని అప్‌‌డేట్ చేయాలనుకున్నారు ఫ్రెడ్, పీటర్‌‌‌‌. రెగ్యులర్ శాండ్‌‌విచ్‌‌తో పాటు రాప్, రోల్, సలాడ్, కుకీస్, మఫిన్, డోనట్స్.. ఇలా రకరకాల వెరైటీలు తీసుకొచ్చారు. సబ్‌‌వే స్పెషల్ శాండ్‌‌విచ్ అయిన బీఎంటీ(బిగ్గెస్ట్, మీటెస్ట్, టేస్టియెస్ట్) శాండ్‌‌విచ్ పుట్టింది కూడా అప్పుడే. 1975లో దీన్ని మొదటిసారి తయారుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సబ్‌‌వేలో బెస్ట్ సెల్లింగ్ శాండ్‌‌విచ్‌‌గా బీఎంటీ పాపులర్ అవుతూ వస్తోంది. ఆ తర్వాత ప్రతీ ఫ్రాంచైజీకి క్వాలిటీ గైడ్‌‌లైన్స్ ఇస్తూ.. అన్ని చోట్లా ఒకేరకమైన క్వాలిటీ, రుచి ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అలా కొన్నేండ్లలో సబ్‌‌వే ఫ్రాంచైజీలు పదుల సంఖ్యలో పెరుగుతూ పోయాయి. అప్పటికే అమెరికాలో ఎంతో పాపులర్ అయిన మెక్ డొనాల్డ్స్‌‌కు సబ్‌‌వే గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత సబ్‌‌వే శాండ్ విచ్‌‌లు దేశాలు దాటి పాపులర్ అయ్యాయి. 1984లో బహ్రెయిన్‌‌లో సబ్‌‌వే మొదటి ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ ఓపెన్ అయింది. 

సబ్‌‌వే అంటే హెల్దీ

సబ్‌‌వే మరింత వేగంగా సక్సెస్ అవ్వడానికి 1997లో ఫ్రెడ్ అమలుచేసిన కొత్త మార్కెటింగ్ టెక్నిక్ కారణమైంది. ఫ్రెడ్ , పీటర్‌‌‌‌లు తక్కువ ఫ్యాట్, తక్కువ క్యాలరీలు ఉండే లైట్ శాండ్‌‌విచ్‌‌లు తయారుచేయడంపై ఫోకస్ పెట్టారు. ఆరు గ్రాముల కంటే తక్కువ ఫ్యాట్ ఉండే ఏడు శాండ్ విచ్‌‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. బరువు తగ్గాలనుకునే వాళ్లను టార్గెట్ చేస్తూ టీవీలో అడ్వర్టైజ్‌‌మెంట్స్ ఇచ్చారు. సరిగ్గా అదేటైంలో ఇండియానాలో జారెద్ అనే అమ్మాయి ‘లైట్ శాండ్‌‌విచ్‌‌లనే డైట్‌‌గా తీసుకుంటూ 193 కేజీల నుంచి 95 కేజీలకు తగ్గాను’ అని తన కాలేజీ జర్నల్‌‌లో రాసింది. అది అప్పట్లో చాలా వైరల్ అయింది. ఫ్రెడ్ , పీటర్‌‌‌‌లు ఆ అమ్మాయితో ఒక అడ్వర్టైజ్‌‌మెంట్ చేయించారు. ఆ ఒక్క యాడ్‌‌తో సబ్‌‌వే సేల్స్ 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత సబ్‌‌వే వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ప్రపంచవ్యాప్తంగా ‘సబ్‌‌వే అంటే హెల్దీ’ అన్న పేరు వచ్చింది.  కొంతకాలం తర్వాత సబ్‌‌వే ‘ఈట్ ఫ్రెష్’ అనే ట్యాగ్ లైన్ తగిలించింది. కస్టమర్ల ముందే ఫ్రెష్‌‌గా బ్రెడ్, కూరగాయలతో శాండ్‌‌విచ్ తయారుచేయడం మొదలుపెట్టింది. ఈ కాన్సెప్ట్ కూడా సబ్‌‌వేకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత శాండ్‌‌విచ్‌‌లో కస్టమర్లు అడిగినన్ని వెజిటబుల్స్ ఉచితంగా ఇవ్వడం, మల్టీ గ్రెయిన్స్, గోధుమలు, ఓట్స్‌‌తో హెల్దీ బ్రెడ్స్‌‌ తయారుచేయడం లాంటి మార్పులు చేశారు.

అతిపెద్ద ఫుడ్ చెయిన్ 

ఒక్క రెస్టారెంట్‌‌తో మొదలై ప్రపంచంలోనే పెద్ద ఫుడ్ చెయిన్‌‌గా ఎదిగిన సబ్‌‌వే ఎంతోమందికి ఇన్‌‌స్పిరేషన్. మొదలుపెట్టిన కొన్నేండ్లలోనే కెఎఫ్‌‌సీ, మెక్‌‌డొనాల్డ్స్‌‌ను వెనక్కు నెట్టి అతిపెద్ద ఫుడ్ చెయిన్ సంస్థగా సబ్‌‌వే ఎదిగింది. ‘ఆరోగ్యాన్ని అందిస్తే లాభాలు అవే వస్తాయి’ అని నమ్మిన ఫ్రెడ్.. సబ్‌‌వేను ఒక హెల్దీ రెస్టారెంట్ బ్రాండ్‌‌గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు. 1965 నుంచి 2015 వరకూ సబ్‌‌వేకు సీఈవోగా ఉన్న ఫ్రెడ్.. ఆ తర్వాత లుకేమియా వ్యాధితో చనిపోయాడు. అయితే ఇప్పటికీ ఫ్రెడ్ డిజైన్ చేసిన శాండ్‌‌విచ్‌‌లే  సబ్‌‌వేలో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.సబ్‌‌వేకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల్లో నలభై వేలకు పైగా ఫ్రాంచైజీలున్నాయి. సబ్‌‌వే నెట్‌‌వర్త్ సుమారు 16 బిలియన్ డాలర్లు.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిముషానికి ఐదువేల శాండ్‌‌విచ్‌‌లు అమ్ముడవుతాయి. శాండ్‌‌విచ్‌‌లో ఏముండాలి అనేది కస్టమర్లే సెలక్ట్ చేసుకోవచ్చు.