అనంతగిరి ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు
సిద్దిపేట, వెలుగు: ‘అనంతగిరి ప్రాజెక్టు కోసం మా పొలాలు, ఇండ్లు, వాకిళ్లు ఇచ్చినం. అధికారుల మాటలు నమ్మి ఆర్అండ్ఆర్ కాలనీకి మారినం.. . మూడేండ్లు గడుస్తున్నా ఇండ్ల పట్టాలు ఇస్తలేరు.. ఆఖరికి కరెంట్బిల్లులు కూడా మా పేరుతో వస్తలేవు.. సర్కారు ఇచ్చిన జాగలో సొంత ఇండ్లు కట్టుకున్న పాపానికి ఇప్పటికీ కిరాయి బతుకులే అయితున్నయ్. మాకు పట్టాలెప్పుడిస్తరో చెప్పండి’ అంటూ చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో 3.5 టీఎంసీల కెపాసిటీతో అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్ నిర్మించారు. దీని నిర్మాణంతో సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురైంది. గ్రామానికి చెందిన 800 ఎకరాలతోపాటు 104 ఇండ్లు ఇందులో ఉన్నాయి. సిద్దిపేట పట్టణ శివార్లలోని ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలో ఇంటికోసం ఒక్కో ఫ్యామిలీకి 250 గజాల స్థలం కేటాయింటారు. మొత్తం 130 మంది నిర్వాసితులు ఇండ్లు కట్టుకున్నారు. దాదాపు 120 కుటుంబాలు 2019 డిసెంబర్లో కాలనీకి మకాం మార్చాయి. షిఫ్టయిన పదిహేను రోజుల్లోనే నిర్వాసితుల పేరిట ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు జారీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
మూడేండ్లుగా ఎదురుచూపులు
సిద్దిపేట పట్టణ శివార్లలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో మూడేండ్లుగా ఇంటి పట్టాల కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. అధికారులను అడితే రేపు మాపంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇండ్లలో ఉంటున్నా వాటిపై ఎలాంటి హక్కులు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ కాలనీలోని ఇండ్ల కరెంటు బిల్లులు నిర్వాసితుల పేరిట కాకుండా డీఈ పేరిట వస్తున్నాయి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓపెన్ ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా పట్టించుకునేవారే కరవయ్యారు. 2019 డిసెంబర్ నాటికి కొచ్చగుట్టపల్లిలో 18 సంవత్సరాలు నిండినవారు 45 మంది ఉన్నట్టు గుర్తించారు. వీరికి ఓపెన్ ప్లాట్లను బొగ్గులోనిబండ వద్ద ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ నిర్వాసితుల్లో మరో 30 మందికి స్ట్రక్చర్లకు సంబంధించిన పరిహారాలు పెండింగ్ ఉన్నాయి.
ఇతరులకు ఇండ్ల కేటాయింపు
ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇతరులకు ఇండ్లను కేటాయించడంతో కొచ్చగుట్టపల్లి నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు. కాలనీలో 130 కుటుంబాలకు ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించినా వివిధ కారణాలతో 105 మందికి మాత్రమే కేటాయించారు. వారం క్రితం మిగిలిన ఇండ్లను ఇతరులకు కేటాయించడమే కాకుండా వారిపేరిట పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ విషయంపై నిర్వాసితులు ఇప్పటికే రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 12.50 లక్షలు, 250 గజాల స్థలాన్ని ఇచ్చారని, సిద్దిపేట జిల్లాలో మాత్రం రూ. 7.50 లక్షలే ఇచ్చారని, మిగిలిన ఐదు లక్షలను ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇంటి నిర్మాణాలకు వెచ్చించారని చెబుతున్నారు. తమ పరిహారంతో ఇండ్లు నిర్మించి ఇతరులకు ఎలా కేటాయిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
హామీలు అమలు చేయాలె
అధికారుల మాటలు నమ్మి మూడేండ్ల క్రితం కుటుంబాలతో ఆర్ అండ్ ఆర్కాలనీకి వచ్చాం. ఇంకా కాలనీలోని ఇండ్లకు సంబంధించిన పట్టాలతో పాటు ఇతర ప్యాకేజీలు పెండింగ్ లో ఉన్నాయి. కాలనీలో ఇతరులకు ఇండ్లను కేటాయిస్తుండటంతో భూ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం లో అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
– కార్తీక్‌రెడ్డి, ఉప సర్పంచ్, కొచ్చగుట్టపల్లి
ఓపెన్ ప్లాట్ ఇస్తలేరు
18 సంవత్సరాలు నిండినవారికి ఓపెన్ ప్లాట్ ఇస్తామని చెప్పారు. మూడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇల్లు, వాకిలి అన్ని వదిలి ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాం. మా సమస్యలను పట్టించుకునే నాథుడే లేరు. అధికారులు ఇప్పటికైనా స్పందించి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.
– బి.మధు, నిర్వాసితుడు, కొచ్చగుట్టపల్లి
త్వరలోనే పట్టా సర్టిఫికెట్లు ఇస్తం
కొచ్చగుట్టపల్లి భూ నిర్వాసితులకు త్వరలోనే ఇంటి పట్టా సర్టిఫికెట్లను అందజేస్తాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. 18 సంవత్సరాలు నిండినవారికి ఓపెన్ ప్లాట్లను బొగ్గులోనికుంట వద్ద ఇవ్వాలని నిర్ణయించాం. ఈ విషయంలో భూ నిర్వాసితులు ఆందోళన చెందవద్దు.
– కె.అనంతరెడ్డి, ఆర్డీఓ, సిద్దిపేట
