కాంగ్రెస్ పంచాయితీ.. రంగంలోకి దిగ్విజయ్

కాంగ్రెస్ పంచాయితీ.. రంగంలోకి దిగ్విజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పంచాయితీపై హైకమాండ్ ఊహించని నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్‌‌ని రంగంలోకి దింపింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ మాణిక్కం ఠాగూర్‌‌‌‌ను పక్కన పెట్టి.. పరిస్థితులను చక్కబెట్టే బాధ్యతలు దిగ్విజయ్‌‌కి అప్పగించడం అనూహ్య పరిణామమని నేతలు అంటున్నారు. ఉమ్మడి ఏపీ, తర్వాత తెలంగాణలో పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా దిగ్విజయ్ సింగ్ పని చేశారు. ఇక్కడి నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.స్థానిక పరిస్థితులపై ఆయనకు కొంత అవగాహన కూడా ఉంది. దీంతో సమస్య పరిష్కారమవుతుందని ఇరువర్గాల నేతలు నమ్ముతున్నారు.

గొడవకు కారణాలపై ఆరా

రాష్ట్రంలో పార్టీ పంచాయితీ పరిష్కరించాలని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు అప్పగించిన వెంటనే దిగ్విజయ్ రంగంలోకి దిగారు. సీనియర్ నేతలందరికీ ఫోన్ చేశారు. గొడవ ఎందుకు జరిగిందో ఆరా తీశారు. విబేధాలు ఎందుకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. తాను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి వస్తానని, అప్పటివరకు సంయమనం పాటించాలని లీడర్లకు దిగ్విజయ్ సూచించినట్లు తెలిసింది. ఎవరూ మీడియాకు ఎక్కవద్దని, పార్టీ ఫోరమ్‌‌‌‌‌‌‌‌లోనే సమస్యను పరిష్కరించుకుందామని చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సీనియర్లు భేటీ కావాలనుకున్నారు. కానీ ఉదయమే దిగ్విజయ్ ఫోన్‌‌‌‌‌‌‌‌తో సీన్ మారిపోయింది. ‘‘దిగ్విజయ్ సింగ్ నాకు ఫోన్​ చేశారు. సంతోషం. రెండ్రోజుల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి మాట్లాడుతా అన్నారు. ఈ రోజు మీటింగ్ పెట్టొద్దని కోరారు” అని మీడియాతో మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆయన సూచన మేరకు భేటీ వాయిదా వేసుకుంటామని చెప్పారు.

ఏండ్లుగా పని చేస్తున్నోళ్లకు పదవులివ్వాలన్నం: భట్టి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. సీనియర్ల సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తామని, వివాదాన్ని ఇంకా జటిలం చేయవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో గొడవ వద్దని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టమని ఆయన చెప్పినట్లు తెలిసింది. దిగ్విజయ్‌‌‌‌‌‌‌‌తో అన్ని విషయాలు చర్చించాలని సూచించినట్లు సమాచారం. భట్టి ఇంటికి పీసీసీ ప్రతినిధులుగా మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్, కోదండ రెడ్డి వెళ్లారు. పార్టీ ఫోరమ్‌‌‌‌‌‌‌‌లో సమస్య పరిష్కరించుకుందామని నచ్చజెప్పారు. ఈ భేటీల తర్వాత మీడియాతో భట్టి చిట్‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాజీనామా చేయాలని తాము ఎవరినీ అడగలేదని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఏండ్లుగా పని చేస్తున్న వారికి పదవులివ్వాలని మాత్రం కోరామని స్పష్టం చేశారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి జనరల్ సెక్రటరీ పదవులు దక్కాయన్నారు.