కబ్జా అయితయని..  అమ్ముకుంటపోతరా?

కబ్జా అయితయని..  అమ్ముకుంటపోతరా?

భూముల వేలంపై కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం
మాజీ ఎంపీ విజయశాంతి పిటీషన్ దాఖలు చేయడంతో విచారణ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని అంత్యంత విలువైన భూములు ఆక్రమణలకు గురవుతాయేమోనని వేలం వేస్తున్నట్లు తెలిపిన సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భూములకు ప్రభుత్వం ట్రస్టీగా ఉండాలే గానీ కబ్జా అవుతాయమోనని అమ్ముకుంటూ పోతే భవిష్యత్‌ ఏం కావాలని ప్రశ్నించింది. భూములకు రక్షణగా కంచె వేయాలని, అమ్ముకుంటూ పోతే రేపటికి మిగిలేదేమీ ఉండదని కోర్టు కామెంట్స్​చేసింది. జిల్లాల్లో భూముల అమ్మకాల నిర్ణయంపై కూడా హైకోర్టు​తీవ్రంగా మండిపడింది.  దీనిపై పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. భూముల వేలం ద్వారా రూ.50 వేల కోట్లు ఆర్జించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జూన్‌ 10న ఇచ్చిన జీవోను కొట్టేయాలని కోరుతూ బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి హైకోర్టులో పిల్‌ వేశారు.  బుధవారం చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ దీనిపై విచారణ జరిపింది. భూములు కబ్జా అవుతాయని చెప్పి అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే రేపు ప్రజల ఆస్తులకు ఎవరు రక్షణగా ఉంటారని హైకోర్టు నిలదీసింది. అయితే, రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, ఖానామెట్‌ గ్రామాల్లోని 44.94 ఎకరాలు, 14.92 ఎకరాలను బహిరంగ వేలం వేయాలనే నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాజశేఖర్‌ వాదిస్తూ, హైదరాబాద్‌ నగరంతోపాటు పట్టణాల్లోని భూముల వేలం నిర్ణయంతోపాటు జిల్లాల్లో వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తక్షణమే జీవో అమలు కాకుండా స్టే ఇవ్వాలన్నారు. ఈ సమయంలో కల్పించుకున్న హైకోర్టు..జిల్లాల్లో వెయ్యి ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వమే తన భూములను కాపాడుకోలేకపోతే రేపు ఇతరుల భూములకు రక్షణ ఎవరు తీసుకుంటారనే సందేహాన్ని లేవనెత్తింది. హెచ్‌ఎండీఏ తరఫు సీనియర్‌ లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, రాజ్యాంగంలోని 298 అధికరణ కింద భూములను అమ్ముకోవడం, ఇతరులకు కేటాయింపు చేసే అధికారం రాష్ట్రానికి ఉందన్నారు. భూముల బహిరంగ వేలానికి చెందిన జీవో 571కి సవరణలు చేసే తాజా జీవోలు జారీ అయ్యాయని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు విచారణను సెప్టెంబర్‌ 8కి వాయిదా వేసింది.