ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? : హైకోర్టు

ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? : హైకోర్టు

హైదరాబాద్ : తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలపై హైకోర్టులో శుక్రవారం (జులై 28న) విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 220 సర్పంచ్, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5,364 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

వాదనలు విన్న సీజే ధర్మాసనం.. ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎన్నికలైతే నిర్వహించాలని వ్యాఖ్యానించింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రెండు వారాలు వాయిదా వేసింది.