ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను రోజూ విచారించండి

ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను రోజూ విచారించండి
  • కింది కోర్టులను ఆదేశించిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్‌‌ కేసులపై రోజువారీ విచారణ జరపాలని కింది కోర్టులను హైకోర్టు శనివారం ఆదేశించింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు, చట్ట సభల్లోని సభ్యులపై ఉన్న కేసులపై విచారణ జరిపే స్పెషల్‌‌ కోర్టు, హైదరాబాద్‌‌ మెట్రోపాలిటన్‌‌ సెషన్స్‌‌ కోర్టుల్లోని పెండింగ్​కేసులు వెంటనే విచారణకు రానున్నాయి. ఇటీవలే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్​కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. ఆ మేరకు కింది కోర్టులకు హైకోర్టు సూచనలు చేసింది. కరోనా నేపథ్యంలో  వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా విచారణ చేపట్టాలా, భౌతిక దూరం పాటిస్తూ విచారణ చేయాలా అనే దానిపై హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌‌ జడ్జితో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడనుంది. విచారణపై ఆయా కోర్టులు తమ డైలీ రిపోర్టును పంపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏపీ సీఎం వైఎస్‌‌ జగన్‌‌ మోహన్‌‌రెడ్డిపై జరుగుతున్న విచారణ తిరిగి ప్రారంభం కానుంది.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నమోదైన కేసులతోపాటు ఇతరత్రా దాఖలైన కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు రోజువారీ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రత్యేక కోర్టుల్లో 118, ఏసీబీ, సీబీఐ కోర్టుల్లో 24 చొప్పున కేసులు పెండింగ్​లో ఉన్నాయి.