ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాలకు నో.. తీర్పు మార్చని హైకోర్టు

ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాలకు నో.. తీర్పు మార్చని హైకోర్టు

హైదరాబాద్: వినాయక నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ పై ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌‌ల ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. పరిస్థితులను అర్థం చేసుకుని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. కానీ పరిస్థితులన్నీ సర్కారు సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. 

నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. జలాశయాలను కలుషితం చేసేందుకు అనుమతి ఇవ్వాలా అంటూ మండిపడింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. అయితే చట్టాలను ఉల్లంఘించాలా, అమలు చేయాలా అనేది ప్రభుత్వ ఇష్టమని పేర్కొంది.  హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జసనం చేయొద్దని గతంలో తాము ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది.