ఆక్వామెరైన్‌‌‌‌ పార్కుతో పర్యావరణానికి ముప్పు

ఆక్వామెరైన్‌‌‌‌ పార్కుతో పర్యావరణానికి ముప్పు
  • నటులు రేణు దేశాయ్, శ్రీవిద్య వేసిన పిల్‌‌‌‌పై హైకోర్టు విచారణ
  • కౌంటర్  దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్, వెలుగు : కొత్వాల్‌‌‌‌గూడలో ఆక్వా మెరైన్‌‌‌‌  పార్క్‌‌‌‌ను ఏర్పాటుచేస్తే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందంటూ దాఖలైన పిల్‌‌‌‌పై హైకోర్టు విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని మునిసిపల్‌‌‌‌  శాఖ ముఖ్య కార్యదర్శి, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి, హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. పర్యావరణపరంగా స్టడీ చేయకుండా ఆక్వామెరైన్‌‌‌‌ ఏర్పాటుచేస్తే పర్యావరణ సమస్యలకు ఆస్కారం ఉంటుందని పేర్కొంటూ  సినీ నటులు రేణు దేశాయ్, జి.శ్రీవిద్య మరో ఇద్దరు దాఖలు చేసిన పిల్‌‌‌‌పై చీఫ్‌‌‌‌  జస్టిస్‌‌‌‌  ఉజ్జల్‌‌‌‌  భూయాన్, జస్టిస్‌‌‌‌ తుకారాంజీతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది పి.శ్రీరమ్య వాదనలు వినిపించారు.

ఆక్వామెరైన్  పార్కు ఏర్పాటుపై పర్యావరణపరంగా ఎలాంటి స్టడీ జరగలేదని, ఈ నేపథ్యంలో ఆ పార్కు ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు, జలచరాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగా ఉండే నీటితో పోలిస్తే కృత్రిమ అక్వేరియంలోని ప్రాణుల జీవితకాలం చాలా తక్కువని ఆమె చెప్పారు. రాబోయే 50 ఏళ్లలో 83 శాతం మంచినీరు క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని చెప్పారు. దీంతో చేపలు, జలచరాల సంఖ్య భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. వాదనల తర్వాత ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో పర్యాటక అభివృద్ధి కోసం ఆక్వామెరైన్‌‌‌‌ పార్క్‌‌‌‌లు వద్దంటే ఎలాగని పిటిషనర్‌‌‌‌ను ప్రశ్నించింది.