పెన్షన్‌‌ కానుక కాదు, హక్కు..తెలుగు అకాడమీ కేసులో హైకోర్టు తీర్పు

పెన్షన్‌‌ కానుక కాదు, హక్కు..తెలుగు అకాడమీ కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: పెన్షన్‌‌ పొందడం రిటైర్డు ఉద్యోగుల హక్కేగాని..కానుక కాదని హైకోర్టు వెల్లడించింది. తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీసు రికార్డులను పరస్పరం తీసుకుని..రిటైర్డ్ ఉద్యోగులకు 2 వారాల్లోగా పెన్షన్‌‌ బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. చివరి దశలో ఉన్న పెన్షనర్లకు 6 శాతం వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిపింది. విచారణను జూన్‌‌ 27కి వాయిదా వేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌‌ సుజయ్‌‌పాల్, జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఏపీలోని తెలుగు అకాడమీ 2022 మే 1న విభజన జరగ్గా.. అందులోని రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్‌‌ ఇవ్వడం లేదని బి.వరలక్ష్మీతో సహా ఏపీ, తెలంగాణకు చెందిన 15 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా తమకు పెన్షన్‌‌ ఇవ్వడం లేదని తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పెన్షన్‌‌ అన్నది కానుక కాదని, సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఇది ఆస్తి హక్కు వంటిదేనని తెలిపింది.