ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లే

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లే
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌‌‌‌) పది శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయట్లేదని బీజేపీ స్టేట్ ఓబీసీ యువ మోర్చా అధ్యక్షుడు ఆలే భాస్కర్‌‌‌‌రాజ్‌‌‌‌, మరో వ్యక్తి పిల్ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌రెడ్డి, జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారణ చేపట్టింది. విద్య, ఉపాధి రంగాల్లో ఈడబ్ల్యూఎస్‌‌‌‌ వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించిది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, వైద్య విద్యలో మాత్రమే పది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మిగిలిన చోట్ల అమలు కావడం లేదని పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్ వాదించారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం చట్టం తెస్తే రాష్ట్రం అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈడబ్ల్యూఎస్‌‌‌‌ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కౌంటర్‌‌‌‌ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేసింది.