
- చేర్యాల, హుస్నాబాద్మున్సిపాలిటీల్లో ఫోర్ లేన్నేషనల్ హైవే పనులకు రంగం సిద్ధం
- వంద ఫీట్ల రోడ్డులో వందల షాపులకు ప్రమాదం
- ఎక్కువ నష్టం కలగకుండా చూడాలని వేడుకోలు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లోని దుకాణాదారులకు హైవే గుబులు పట్టుకుంది. నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ రెండు మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణ పనులకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదుగా మెదక్ వరకు 765 డీజీ, సూర్యాపేట నుంచి జనగామ, దుద్దెడ మీదుగా సిరిసిల్ల వరకు 365 బీ నేషనల్ హై వేల నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటిది సిద్దిపేట నుంచి మెదక్ వరకు 65 కిలో మీటర్లు, రెండవది ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు 64 కిలో మీటర్ల మేర పనులను స్టార్ట్ అయ్యాయి. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదుగా వెళ్లే హైవే హుస్నాబాద్ మీదుగా, సూర్యాపేట నుంచి సిరిసిల్ల వెళ్లే హైవే చేర్యాల మున్సిపాలిటీ మీదుగా సాగుతుంది. ఈ హైవేలను వంద ఫీట్ల వెడల్పుతో ఫోర్ లేన్‌గా నిర్మిస్తుండటంతో ఈ రెండు పట్టణాల్లో వందల షాపులు తొలగించాల్సి వస్తోంది.
ఇటీవల సంబంధిత అధికారులు చేర్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డు డివైడర్ కు ఇరువైపులా 50 ఫీట్ల మేర నిర్మాణలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగా మెయిన్ రోడ్డులో సర్వే నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోడ్డు పట్టణంలోనే దాదాపు మూడు కిలో మీటర్లకు పైగా సాగుతుంది. దాదాపు 200 దుకాణాలు పాక్షికంగా, పూర్తిగా తొలగించాల్సి రావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే మార్గంలో పోలీస్ స్టేషన్, చర్చి, కబ్రస్థాన్, ఆంజనేయ స్వామి ఆలయం ఉండటంతో వాటిని ఏమి చేస్తారనే ఆసక్తి నెలకొంది. చేర్యాల మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణపై సర్వే జరిపి పాక్షికంగా, పూర్తి స్థాయిలో ఎన్ని దుకాణాలను తొలగించాలనే విషయంపై నివేదికను కలెక్టర్ కు సమర్పించగానే పనులు మొదలయ్యే అవకాశం వుంది. హుస్నాబాద్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.
పట్టణంలో మార్కెట్ యార్డు చౌరస్తా నుంచి అణభేరి చౌరస్తా వరకు దాదాపు రెండు కిలో మీటర్ల లో ఐదు వందలకు పైగా షాపులున్నాయి. ఎన్నో ఏండ్లుగా దుకాణాలే తమకు ఉపాధిగా ఉన్నాయని, ఇప్పుడు రోడ్డు విస్తరణలో పోతే ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు. మానవతాదృక్ఫథంతో దుకాణాలకు ఎక్కువ నష్టం కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా రోడ్డులో కోల్పోతున్న నిర్మాణాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇటీవల ఆదేశించారు. దీంతో త్వరలోనే హుస్నాబాద్ పట్టణంలో సర్వే చేసే అవకాశం ఉంది.
దుకాణాలతోనే బతుకుతున్నాం
చేర్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డులో దుకాణాలు నడుపుతూ ఎన్నో ఏండ్లుగా ఉన్నాం. అవే మాకు ఆధారం. అధికారులు తమ గోడును అర్థం చేసుకొని మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి. ఎక్కువ నష్టం కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలి.
- కూరపాటి మధుసూదన్, చిరు వ్యాపారి, చేర్యాల
త్వరలో సర్వే చేస్తాం..
చేర్యాల పట్టణంలో వంద ఫీట్ల రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ చేయాలని ఇప్పటికే నేషనల్ హైవే అధికారుల నుంచి లేఖ అందింది. డివైడర్ కు ఇరువైపులా 50 ఫీట్ల మేర రోడ్డు విస్తరిస్తే ఎన్ని దుకాణాలను కూల్చాల్సి వస్తుందనే విషయంపై సర్వే చేస్తాం. కలెక్టర్ కు నివేదిక అందించి తదుపరి తర్వాత చర్యలు తీసుకుంటాం.
రాజేందర్ కుమార్, మున్సిపల్ కమిషనర్, చేర్యాల