తెలంగాణలోనూ కుంకుమ పువ్వు సాగు..ఏరోఫోనిక్ పద్ధతిలో హార్టికల్చర్ వర్సిటీ ప్రయోగం సక్సెస్

తెలంగాణలోనూ కుంకుమ పువ్వు సాగు..ఏరోఫోనిక్ పద్ధతిలో హార్టికల్చర్ వర్సిటీ ప్రయోగం సక్సెస్
  •     వనపర్తి జిల్లా మోజర్ల కాలేజీలో మోడల్ ల్యాబ్ ఏర్పాటు
  •     అందులో కృత్రిమంగా కాశ్మీర్ తరహా వాతావరణం సృష్టి  
  •     పంట దిగుబడి, నాణ్యత ఉత్తమంగా ఉన్నాయని సైంటిస్టుల వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  కాశ్మీర్ పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అత్యంత విలువైన కుంకుమ పువ్వు (సాఫ్రాన్) సాగు తెలంగాణలోనూ సాధ్యమని హార్టికల్చర్ వర్సిటీ ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఏరోఫోనిక్ పద్ధతిలో నియంత్రిత వాతావరణంలో ఈ ఖరీదైన పంటను విజయవంతంగా పండించడం ద్వారా రాష్ట్ర రైతులకు కొత్త అవకాశాలను సృష్టించింది.  నాబార్డ్ ఆర్థిక సహకారంతో వనపర్తి జిల్లాలోని మోజర్ల హార్టికల్చర్​కాలేజీలో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. రెండు నెలల వ్యవధిలోనే పూర్తి ఫలితాలు ఇచ్చింది. ఈ పరిశోధన హార్టికల్చర్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్రాన్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ ఇవ్వాలని హార్టికల్చర్​వర్సిటీ యోచిస్తున్నది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆర్థిక అవకాశాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

కాశ్మీర్ వాతావరణం సృష్టి.. 

ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రయోగంలో హార్టికల్చర్​వర్సిటీ సైంటిస్టులు పాలుపంచుకున్నారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఏరోపోనిక్ మోడల్ ల్యాబ్‌‌లో కాశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమపువ్వు కాడలు నాటారు. కాశ్మీర్‌‌‌‌లో రాత్రి, పగలు వేర్వేరుగా ఉండే ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అక్కడి సూర్యరశ్మి, కర్బన వాయువు మోతాదును.. అచ్చం అక్కడి మాదిరిగా మిషిన్లతో ల్యాబ్‌‌లో వాతావరణం ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్పు చేసుకునేందుకు వీలుగా ఉండే పరికరాలను అమర్చారు. ఇలా మిషిన్ల సహాయంతో కృత్రిమంగా కాశ్మీర్ వాతావరణం సృష్టించారు. మొబైల్ యాప్ ద్వారా ఉష్ణోగ్రత, కాంతి, తేమలను నియంత్రిస్తూ సాగు చేశారు. ఫలితంగా మొక్కలు మొలిచి, పూలు వికసించాయి. దిగుబడి, నాణ్యత రెండూ అధిక స్థాయిలో నమోదయ్యాయి. 

ప్రయోజనాలూ ఎక్కువే.. 

ఈ ప్రయోగం​విజయవంతం కావడంతో తెలంగాణలోనూ సాఫ్రాన్ సాగుకు మార్గం సుగమమైందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏరోపోనిక్ పద్ధతి ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా కూలీల అవసరం తక్కువ, పంట పూర్తిగా సేంద్రీయం, దిగుబడి, నాణ్యత కూడా ఎక్కువగా లభిస్తుంది. శాస్త్రవేత్తలు ల్యాబ్‌‌లోనే కృత్రిమ వాతావరణం సృష్టించి.. విజయవంతంగా కుంకుమ పువ్వును సాగు చేయగలిగారు. దీంతో ఈ పద్ధతిలో కుంకుమ పువ్వు సాగుకు చాలామంది ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. 

కాశ్మీర్‌‌‌‌కే పరిమితం..  

ప్రస్తుతానికి మన దేశంలో సంప్రదాయ కుంకుమపువ్వు సాగు కేవలం జమ్మూకాశ్మీర్‌‌‌‌కే పరిమితమైంది. పుల్వామా జిల్లాలోని పంపూర్‌‌‌‌లో అత్యధికంగా సాగు చేస్తారు. అలాగే శ్రీనగర్, బుద్గాంలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. అయితే ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌‌‌‌లో రియల్ ఎస్టేట్ పెరగడం, పర్యావరణ మార్పులతో కుంకుమపువ్వు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు నాణ్యత కూడా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో దేశమంతటా ప్రత్యామ్నాయ సాగు మార్గాల్లో కుంకుమపువ్వు ఉత్పత్తికి పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రోపోనిక్, ఏరోపోనిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ.. మేలైన ఉత్పత్తి మార్గంగా ఏరోపోనిక్ సాగును పరిశోధకులు ఎంచుకుంటున్నారు. 

రూరల్ ఎకానమీకి బూస్ట్.. 

రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా జరుగుతున్న పరిశోధనలకు నిధులు అందించి ఆర్థికంగా సహకరిస్తున్నాం. ఏరోపోనిక్ పద్ధతిలో సాఫ్రాన్ సాగు విజయవంతం కావడం సంతోషకరం. ఈ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు, యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇది రూరల్ ఎకానమీకి బూస్టింగ్‌‌లా పని చేస్తుంది. 
- బి.ఉదయ్ భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్ తెలంగాణ

దిగుబడి, నాణ్యత బెస్ట్..  

నాబార్డ్ సహకారంతో కాశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కుంకుమపువ్వును పండించాం. గాలిలో తేమ పరిస్థితులను ప్రయోగశాలలో కల్పించి కుంకుమపువ్వు పండించగలిగాం. దిగుబడి, నాణ్యత రెండూ ఉత్తమంగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. 
-ప్రొఫెసర్ పిడిగం సైదయ్య, ప్రాజెక్టు ప్రిన్సిపల్​సైంటిస్ట్​  

ప్రాంతాల వారీగా ల్యాబ్‌‌లు.. 

రాష్ట్ర రైతులకు ఆధునిక ఉద్యానవన సాంకేతికతలను అందించేందుకు హర్టికల్చర్ యూనివర్సిటీ నిరంతరం పరిశోధనలు చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కుంకుమపువ్వును విజయవంతంగా సాగు చేశాం. త్వరలో ఈ టెక్నాలజీ వివరాలను రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందిస్తాం. అవసరమైతే ప్రాంతాల వారీగా సాఫ్రాన్ మోడల్ ల్యాబ్‌‌లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తాం. 
- డాక్టర్ దండా రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్ వర్సిటీ