ముషీరాబాద్, వెలుగు: హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడు చనిపోవడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ హాస్పిటల్‌పై దాడికి దిగారు. ఈ ఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని శ్రీకర హాస్పిటల్ వద్ద ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం..
మాణిక్యేశ్వర్ నగర్ వడ్డెర బస్తీకి చెందిన శేఖర్ నీల దంపతుల కొడుకు జ్ఞానేశ్వర్(20) ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆదివారం అతడు మృతిచెందినట్లు డాక్టర్లు కుటుంబానికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
రూ.10 లక్షలు వసూలు చేసి పది రోజులు చికిత్స అందించాక ఎలా మృతిచెందాడని హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహానికి గురై హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతిచెందాడని ఆరోపించారు.
