V6 News

కుంగిపోతున్న జోషిమఠ్

కుంగిపోతున్న జోషిమఠ్

కుంగిపోతున్న జోషిమఠ్

గోపేశ్వర్ (ఉత్తరాఖండ్) :  హిమాలయన్​ టౌన్​ జోషిమఠ్​లోని ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయి. భూమి కుంగిపోతున్నది. రోడ్లు బీటలు వారుతున్నాయి. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి జోషిమఠ్​ను గేట్​వేగా పిలుస్తారు. ఎన్​టీపీసీ చేపడుతున్న డెవలప్​మెంట్ ప్రాజెక్టులే దీనికి కారణమంటూ జోషిమఠ్​ ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జోషిమఠ్​ మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్​ కోసం హెలాంగ్, మార్వాడి మధ్య ఎన్​టీపీసీ నిర్మిస్తున్న టన్నెల్​తో పాటు బైపాస్​ రోడ్డు నిర్మాణం ఆపేయాలని అక్కడివాళ్లు డిమాండ్​ చేస్తున్నారు. తపోవన్​– విష్ణుగడ్​ హైడల్​ ప్రాజెక్టు కూడా ఈ విపత్తుకు కారణమని ఆరోపిస్తున్నారు. పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. 

జోషిమఠ్​కి వస్తాను : సీఎం పుష్కర్​ సింగ్ ధామి 

‘‘జోషిమఠ్​లో నెలకొన్న పరిస్థితిని నేను సమీక్షిస్తున్నా. తొందరలోనే కుంగిపోయిన ఏరియాను సందర్శిస్తాను. అధికారుల నుంచి రిపోర్టు అందగానే అవసరమైన చర్యలు తీసుకుంటాను. అక్కడి పరిస్థితిపై మున్సిపల్​ అధికారులతోనూ మాట్లాడాను. భయపడాల్సిన అవసరం లేదు. నిపుణులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను’’అని  ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. 

తరలిపోయిన 60 కుటుంబాలు 

జోషిమఠ్​లోని 600 కుటుంబాలు రిస్క్​లో ఉన్నాయి. ఇప్పటికే 60 ఫ్యామిలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇంకో 29 కుటుంబాలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు. జోషిమఠ్​లోని రోడ్ల పరిస్థితిపై ఐఐటీ రూర్కీ టీం రిపోర్టు సిద్ధం చేసి సీఎంకు ఇవ్వనుంది. తొలుత 3 వార్డులకే పరిమితమైన పగుళ్లు ఇప్పుడు 9 వార్డులకు వ్యాపించాయి. 561 ఇండ్లకు పగుళ్లు వచ్చాయి. మున్సిపాల్టీ భవన్, స్కూల్, మిలన్​ కేంద్రం, గురుద్వారాను సేఫ్​ ప్లేస్​కు తరలించారు. కొన్ని చోట్ల భూమి నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి.