ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇస్తలేరు

ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇస్తలేరు

హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా తమకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని బాధితులు వర్షంలో నిరసన తెలిపిన ఘటన నాగోల్ బండ్లగూడలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... తమకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేపర్ లకు మాత్రమే పరిమితం అయ్యాయని, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్యం చేశారు. వర్షాలు కురుస్తుండంటంతో సొంత ఇళ్లు లేక రోడ్ల మీదనే జీవనం చాలిస్తున్నామని తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే తాము వేలల్లో అద్దెలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో  తాను అప్పట్లో రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని దెబ్బలు తిన్నానని, అయినా తనకు ఇల్లు రాలేదని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని,  చివరకు ఉండడానికి కూడాలేని పరిస్థితి దాపురించిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు  కేటాయించాలని బాధితులు డిమాండ్ చేశారు.