తెలంగాణలో ముసురుకుంటున్న విషజ్వరాలు...

తెలంగాణలో ముసురుకుంటున్న విషజ్వరాలు...
  • ఒక్కరోజే ఎంజీఎంకు 2,569 ఓపీ, 168 ఇన్​ పేషెంట్లు 
  • వరంగల్‍ జిల్లాలో 185 చికెన్‍ గున్యా, 12 డెంగీ కేసులు

వరంగల్‍ / వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్​లో రోజురోజుకూ విషజ్వరాల బాధితులు పెరుగుతున్నారు. చికెన్‍ గున్యా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. చికిత్స కోసం పేదలు వరంగల్ ఎంజీఎం బాట పడ్తున్నారు.   కొద్దిరోజులుగా ఎంజీఎం హాస్పిటల్ పొద్దున 7 గంటలకే పేషెంట్లతో నిండిపోతున్నది. ఎంజీఎం ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం.. నిన్నమొన్నటి వరకు 1,200 నుంచి 1,400 మధ్య ఉండే ఔట్‍ పేషెంట్ల సంఖ్య సోమవారం 2,569కి చేరింది. ఇందులో 168 మంది ఇన్‍ పేషెంట్లుగా హాస్పిటల్​లో చేరారు.  ఓపీ కోసం వచ్చిన వారిలో విష జ్వరాలు, కాళ్లు, కీళ్ల నొప్పులు, వాతావరణంలో మార్పుల నేపథ్యంలో చెవి, గొంతు ముక్కు సమస్యలతో ఎక్కువగా వచ్చారు. ఒంటి నొప్పులు ఉండడంతో కూర్చునే ఓపిక లేక బాధితులు అవస్థలు పడ్డారు.

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోని వరంగల్‍, హనుమకొండ, కాజీపేటలో 183 స్లమ్‍ ఏరియాలు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నా.. వాస్తవంగా 200కు పైగానే ఉంటాయి. దాదాపు 2.25 లక్షల మంది నివసిస్తున్న ఈ కాలనీల్లో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుంది. అభివృద్ధి పనుల పేరుతో ఎక్కడికక్కడ గుంతలు తవ్వి వదిలేయడంతో నీరు నిలిచి దోమలు పెరిగాయి. కాజీపేటలోని కడిపికొండ రాజీవ్‍ గృహకల్ప కాలనీలో ఓ బాలుడికి మలేరియా సోకింది. ఆఫీసర్లు సకాలంలో స్పందించకుంటే ఇదే పరిస్థితి మిగతా కాలనీల్లో తలెత్త వచ్చు.

ఒక్క జిల్లాలోనే వందల్లో కేసులు..

ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలుగా విభజించారు. ఇందులో వరంగల్ జిల్లాలో జూన్​లో చికెన్‍ గున్యా కేసులు 185, డెంగీ కేసులు 12, మలేరియా ఒక కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ వరంగల్‍ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధి మండలాల్లోని 24 యూపీహెచ్‍సీ, పీహెచ్‍సీ సెంటర్లలో నమోదైన కేసులు మాత్రమే. మేలో ఒక్క డెంగీ కేసు నమోదవగా, జూన్‍లో 12కు చేరింది. చికెన్‍ గున్యా కేసులు వందలోపు ఉండగా అవి డబుల్‍ అయ్యాయి. ఈ ఏడాది మలేరియా కేసులు నాలుగు రాగా అందులో మూడు ఇటీవలే నమోదయ్యాయి. బాధితుల సంఖ్య ఒక్క జిల్లాలోనే ఇలా ఉంటే.. ఉమ్మడి వరంగల్‍ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంటుందని ఆఫీసర్లు 
చెప్తున్నారు. కాగా, ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వానలతో దోమలు పెరిగి.. విష జ్వరాల సంఖ్య పెరుగుతున్నదని అంటున్నారు. 

సర్కారు ఆస్పత్రులకు వస్తున్నది 10 శాతమే

మలేరియా, డెంగీ, చికెన్‍ గున్యాతో ఆయా జిల్లాల్లోని పీహెచ్‍సీ సెంటర్లకు వస్తున్న కేసులే అధికారికంగా నమోదవుతున్నాయి. ఆర్‍ఎంపీల సాయంతో డైరెక్ట్​గా ప్రైవేట్‍ హాస్పిటల్స్​ వెళ్లేవారు వరంగల్​ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఉన్నారు. మొత్తం విషజ్వరాల బాధితుల్లో సర్కారు ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నవారు కేవలం 10 శాతం మాత్రమేనని డాక్టర్లు చెప్తున్నారు.

జ్వరం, కీళ్లనొప్పులున్నయ్​..

మాది జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లె. మూణ్ణాలుగు రోజుల నుంచి ఇద్దరికీ జ్వరం వస్తున్నది. ఒళ్లు బాగా కాలుతున్నది. గోలీలు వేసుకున్నా తగ్గలే. కీళ్ల నొప్పులు అవస్థ పెడ్తున్నయ్. డాక్టర్లకు చూపెట్టుకునే ఓపీ చీట్టి లేట్​ అయితే దొరకదని చెప్పిన్రు. అందుకే పొద్దున్నే ఎంజీఎం వచ్చినం.  లేటైనా డాక్టర్‍కు సూపెట్టుకుని పోతం.
- బొచ్చు భద్రమ్మ కొమురయ్య దంపతులు