హుస్సేన్‌‌‌‌‌‌‌‌ సాగర్ చుట్టూ అష్ట దిగ్బంధం

హుస్సేన్‌‌‌‌‌‌‌‌ సాగర్ చుట్టూ అష్ట దిగ్బంధం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాదీల పాలిట ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ శాపంగా మారింది. హుస్సేన్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో వాహనదారులకు నడి రోడ్డుపై నరకం చూపింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఫార్ములా వన్ రేస్‌‌‌‌‌‌‌‌ కారణంగా బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మింట్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌, ఐమాక్స్‌‌‌‌‌‌‌‌ కు వెళ్లే రూట్లన్నీ బంద్ చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసింగ్‌‌‌‌‌‌‌‌ కారణంగా శనివారం ఉదయం నుంచే పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌రోడ్స్, షాదాన్ కాలేజ్, సైఫాబాద్‌‌‌‌‌‌‌‌ ఓల్డ్‌‌‌‌‌‌‌‌ పీఎస్, టెలిఫోన్‌‌‌‌‌‌‌‌ భవన్, లక్డీకపూల్‌‌‌‌‌‌‌‌, ఇక్బాల్‌‌‌‌‌‌‌‌ మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసెంబ్లీ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రోడ్లు కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ జామయ్యాయి. ఉదయం11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పంజాగుట్ట నుంచి అసెంబ్లీ రూట్‌‌‌‌‌‌‌‌, మెహిదీపట్నం నుంచి లక్డీకపూల్‌‌‌‌‌‌‌‌  వెళ్లే  రూట్లలో వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్ ట్రాఫిక్ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ రోడ్లపై కనిపించింది. పంజాగుట్ట, బేగంపేట నుంచి మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్స్, సికింద్రాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌ మీదుగా లిబర్టీ, అసెంబ్లీ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్, మహావీర్ హాస్పిటల్, అయోధ్య జంక్షన్, నిరంకారీ, షాదాన్ కాలేజ్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్ నత్తనడకన సాగింది. మోటారిస్టులు  ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకుని ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక నరకం చూశారు. ట్రాఫిక్  స్తంభించిన రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేయాలని పోలీసులు సూచించారు.