కామన్వెల్త్లో సెమీస్ చేరిన భారత మహిళల జట్టు

కామన్వెల్త్లో సెమీస్ చేరిన భారత మహిళల జట్టు

కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల జట్టు సెమీస్ లో అడుగుపెట్టింది.  పతకం రేసులో నిలవాలంటే..ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఉమెన్స్ టీమ్ అదరగొట్టింది. బార్బడోస్ పై వంద పరుగులతో గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది. 

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మందాన..ఈ మ్యాచ్ లో  నిరాశ పరిచినా...మరో ప్లేయర్ షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్ కు 76 పరుగుల పాట్నర్ షిప్ ను నమోదు చేశారు. ఇదే క్రమంలో షెఫాలీ 26 బంతుల్లో  సిక్సర్, 7  ఫోర్లతో 43 పరుగులు సాధించింది. అయితే  కెప్టెన్ హర్మన్ ప్రీత్ డకౌట్ అవ్వగా.. తానియా భాటియా 6 పరుగులే చేసి పెవీలియన్ చేరింది. ఈ సమయంలో రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.  దీప్తి శర్మతో కలిసి స్కోరు బోర్డును నడిపించింది. రోడ్రిగ్స్  46 బంతుల్లో  సిక్సర్, 6 ఫోర్లతో 56 రన్స్ చేయగా.. దీప్తిశర్మ 28 బంతుల్లో  సిక్సర్, రెండు ఫోర్లతో 34 రన్స్ చేసింది. దీంతో  భారత్ 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది. 

163 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బార్బడోస్ భారత బౌలర్ల ధాటికి..8 వికెట్లకు 62 పరుగులే చేయగలిగింది. బార్బడోస్  బ్యాటర్లలో క్యాషోనా నైట్ 16 పరుగులు, షకీరా 12  పరుగులు మాత్రం చేశారు. భారత బౌలర్లలో  రేణుక సింగ్4 వికెట్లు దక్కించుకుంది. మేఘన సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య విజేతతో టీమిండియా సెమీస్‌లో తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత మహిళల జట్టుకు పతకం ఖాయమవుతుంది.