పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్​కు ఊరట.. జైలు శిక్షను సస్పెండ్​ చేసిన హైకోర్టు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్​కు ఊరట.. జైలు శిక్షను సస్పెండ్​ చేసిన హైకోర్టు

ఇస్లామాబాద్ : తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్  ఖాన్ కు ఇస్లామాబాద్  హైకోర్టు(ఐహెచ్​సీ) భారీ ఊరట కల్పించింది. జిల్లా కోర్టు విధించిన జైలు శిక్షను ఐహెచ్​సీ సస్పెండ్ చేసింది. రూ.లక్ష ష్యూరిటీ మీద ఇమ్రాన్​ను విడుదల చేయాలని ఆదేశించింది. ఐహెచ్​సీ చీఫ్ జస్టిస్ ఆమిర్  ఫరూఖ్, జస్టిస్  తారిఖ్  మెహమూద్  జహంగీర్​తో కూడిన డివిజన్  బెంచ్  మంగళవారం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఇదే విషయాన్ని ఇమ్రాన్ తరపు లాయర్లు కూడా ట్విటర్​లో వెల్లడించారు. 

తోషాఖానా కేసులో ఇమ్రాన్​ను దోషిగా పేర్కొంటూ డిస్ట్రిక్ట్  కోర్టు జడ్జి హుమాయున్  దిలావర్  ఈ నెల 5న తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఆయనకు మూడేండ్ల జైలుశిక్ష విధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా ఆదేశాలు జారీచేశారు. దీంతో డిస్ట్రిక్ట్  కోర్టు తీర్పును ఇమ్రాన్.. ఐహెచ్​సీలో సవాలు చేశారు. ఈ నెల 22న తోషాఖానా కేసుపై ఐహెచ్​సీ మరోసారి విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్నాక.. ఇమ్రాన్​ను దోషిగా తేల్చేందుకు తగిన సాక్ష్యాధారాలులేవని మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా, అఫీషియల్  సీక్రెట్స్ యాక్ట్ రూల్స్  ఉల్లంఘించిన కేసులో ఇమ్రాన్​ను జైల్లోనే ఉంచాలని స్పెషల్ కోర్టు మంగళవారం ఆర్డర్ వేసింది. బుధవారం ఆయనను విచారణకు తీసుకురావాలని ఆదేశించింది.

ఏమిటీ తోషాఖానా కేసు?

పాక్ ప్రధానిగా ఇమ్రాన్  ఖాన్​కు పలు దేశాల నుంచి కానుకలు అందాయి. వాటి విలువ రూ.14 కోట్లు. వాటిని ఆయన తన వద్దే ఉంచుకున్నారు. కొన్నింటిని అధిక ధరకు అమ్ముకున్నారు. తోషాఖానా నిబంధనల ప్రకారం గిఫ్టుల వివరాలను క్యాబినెట్  డివిజన్​కు తెలియజేయాలి. కానీ, ఇమ్రాన్  ఆ వివరాలను దాచిపెట్టారు.